హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ) : ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)తో రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఓటుహకును రక్షించుకునేందుకు ‘సర్’పై వార్డు, గ్రామస్థాయి నుంచి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్ధ్దారక భవన్లో సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన ‘ప్రత్యేక సమగ్ర సవరణ’(సర్)పై రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పలువురు ప్రముఖులు, విశ్లేషకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
చట్టాలపై అవగాహన అవసరం : మాడభూషి శ్రీధర్
చట్టాలపై అవగాహన అవసరమని ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ సూచించారు. నాన్ అప్లికబుల్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. నాన్ అప్లికబుల్ అంటే.. పోటీ చేసేందుకు అవకాశం ఉండబోదని, ఓటరు జాబితాలోనూ ఇదేవిధంగా ఓట్లను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఓట్లు లేనివాళ్లు ఎకడికి పోవాలని ఆయన ప్రశ్నించారు. ఆధార్ ఉన్నంత మాత్రాన సిటిజన్ కాదని, పాన్ కూడా ఉండాలని, పాస్‌పోర్ట్ ఉంటే సరిపోదని, ఓటుహకు కూడా ఉండాలని, ఇవన్ని లేకుంటే పౌరసత్వం రాని పరిస్థితులు నెలకొంటాయని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యంపై దాడి లాంటిందే : కూనంనేని
ఓటర్ల తొలగింపు ప్రజాస్వామ్యంపై దాడి లాంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని సూచించారు. ఎన్నికల వ్యవస్థను, ఓటరు హకులను కాపాడేందుకు సీపీఐ నిరంతరం కృషి చేస్తున్నదని, అందులో భాగంగానే మేధావులు, నిపుణులతో సదస్సు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సదస్సు సూచనల మేరకు రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు.
భారత్‌లోనూ ఇజ్రాయెల్ తరహా ధోరణి : ప్రొఫెసర్ నాగేశ్వర్
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. భారతదేశంలోనూ ఇజ్రాయెల్ తరహా నాన్ జూయిస్ బతుకకూడదనే ధోరణి తీసుకొస్తున్నారని విమర్శించారు. గాజాలో 70 లక్షల మందిని చంపేశారని, సౌత్ ఆఫ్రికాలో 70-80 శాతం భూములు తెల్లవారి ఆధీనంలో ఉంటాయని, దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారని, అదే తరహాలో భారతదేశంలోనూ ఓటర్ల తొలగింపు చేపట్టారని విమర్శించారు.
రాజకీయాలు మార్చే పన్నాగం : పరకాల
దేశ రాజకీయ పరిస్థితులు మార్చేందుకే ‘సర్’ను ప్రవేశపెట్టారని పరకాల ప్రభాకర్ విమర్శించారు. బీహార్‌లో 63 లక్షలు, పశ్చిమబెంగాల్ 90 లక్షలు, తమిళనాడులో 97లక్షలు, కేరళలో 27లక్షల ఓటర్లను తొలగించారని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోనూ 2.83 కోట్ల ఓట్లర్లను తొలగిస్తే ఎవ్వరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తొలగించిన ఓటర్లలో ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలతోపాటు ఆదివాసీ, దళితులు, పేద, సామాన్య ఓటర్లే అత్యధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సహాయ కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, నరసింహ, జాతీయ కార్యవర్గ సభ్యులు పద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బోస్, బాలనర్సింహ, శంకర్ పాల్గొన్నారు.