హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): కృష్ణా, గోదావరి నదీజలాల వాటాను కొల్లగొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నారు. సుదీర్ఘకాలం పోరాడి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ సాధించిన సెక్షన్-3 మార్గదర్శకాలను ఒప్పుకొనే ప్రసక్తే లేదని ఏపీ తెగేసి చెప్తూ అడుగడుగునా అడ్డుపడుతున్నది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులనూ ఒప్పుకోబోమని వాదిస్తున్నది. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను అంగీకరించేది లేదంటూ కరాఖండిగా చెప్తున్నది. మరోవైపు అవార్డుకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతుల్లేకుండానే ఇబ్బడిముబ్బడిగా ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. అదేమంటే కేంద్రాన్ని ముందుకు నెడుతూ పోలవరం నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అనుమతులు సాధించేందుకు కుట్రల మీద కుట్రలకు తెరలేపుతున్నది. కృష్ణా ట్రిబ్యునల్ తరహాలోనే గో దావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నది. ఇక రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం అందుకు వంతపాడుతూ తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతున్నది. ఒకవైపు ప్రాజెక్టులను నిర్మించకుండా, మ రోవైపు చర్చలకు పరుగులు పెడుతూ ఏపీ ఎత్తులకు రాష్ట్ర ప్రభుత్వం జీహుజూర్ అంటున్నది.
సెక్షన్-3పై ఆది నుంచీ అక్కసు..
రాష్ట్ర విభజన సందర్భంగా కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్-89 పేరిట మార్గదర్శకాలను జారీచేశారు. అప్పటికే జరిగిన నీటి కేటాయింపులను ప్రాజెక్టుల వారీగా మార్చాలని మాత్రమే నిర్దేశించారు. దీంతో తెలంగాణకు 299 టీఎంసీలకు మించి ఒక్క చుక్క కూడా అదనంగా వచ్చే అవకాశం లేకుండాపోయింది. ఏపీకి 512 టీఎంసీలు దక్కుతాయి. సెక్షన్-89 ప్రకారం తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని కేసీఆర్ ప్రభుత్వం నాడు తీవ్రంగా వ్యతిరేకించింది. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ మధ్య న్యాయమైన వాటా వేయాలని డిమాండ్ చేసింది. పదేండ్ల పాటు కేంద్రంపై పోరాడి అపూర్వ విజయాన్ని సాధించింది. తెలంగాణకు నీటిహక్కులు సాధించేందుకు బాటలు వేసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ)కు కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీచేసింది. అప్పటినుంచి ఏపీ సర్కార్ అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నది. తొలుత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలుచేసింది. ఆపై ట్రిబ్యునల్‌లోనూ వాదనలను వినిపిస్తున్నది. సెక్షన్-3 కొత్త టీవోఆర్ చెల్లబోదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అది విరుద్ధమని వాదిస్తున్నది. ట్రిబ్యునల్-1, 2 చేసిన నీటి కేటాయింపులను మార్చడానికి లేదని, తెలంగాణకు స మాన వాటాలను ఇవ్వలేమని ఏపీ తెగేసి చెప్తున్నది. మరోవైపు ఎలాంటి అనుమతులు లేకుండా, అవార్డుకు విరుద్ధంగానే ప్రాజెక్టులను చేపడుతున్నది. నదీ జలాలను కొల్లగొట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నది. అదేమంటే జలవివాదాలపై చర్చలకు సిద్ధమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది.
నిస్సిగ్గుగా కేంద్ర సర్కార్ మంతనాలు..
ఇదిలాఉంటే ఏపీని నిలువరించాల్సిన కేంద్రం దానికి వత్తాసు పలుకుతున్నది. సెక్షన్-3పై ఏపీ వేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలోనే తిరస్కరించింది. నూతన మార్గదర్శకాల ప్రకారమే ట్రిబ్యునల్ సైతం విచారణ కొనసాగిస్తున్నది. కృష్ణా జలాల దోపిడీ, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేకమార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. అవార్డు ప్రకారమే నీటి వినియోగాలకు అనుమతివ్వాలని పట్టుబట్టింది. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సైతం పలుమార్లు ఫిర్యాదుచేసింది. కానీ ఒక్క అంశంలోనూ కేంద్రం తెలంగాణకు సహకరించ లేదు. అదేమంటే ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్నదంటూ కుంటిసాకును చూపి తప్పించుకుంటున్నది. అవార్డు అమల్లోకి రావాలంటూ చోద్యం చూసింది. ఏపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న రీతిలో ఆది నుంచీ వ్యవహరిస్తున్నది. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫిజబులిటీ రిపోర్టు)పై సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ), కృష్ణా, గోదావరి రివర్బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలు అభ్యంతరం తెలిపాయి. బనకచర్ల ప్రాజెక్టుపై ముందుకుపోవద్దని కేంద్రానికి స్పష్టంగా తెలియజేశాయి. ఏపీ ఒత్తిడితో కేంద్రం ప్రాజెక్టుపై ముందుకే సాగుతున్నది.
అదీగాక ఏపీకి లబ్ధి చేకూ
ర్చేందుకు చర్చల పేరిట తెలంగా ణ సర్కార్‌తో మంతనాలకు తెరతీసింది. పన్నెండేండ్లలో ఎన్నడూ లేనివిధంగా జలవివాదాల పరిష్కారం కోసమంటూ కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు, ఏపీ సర్కార్ వాదిస్తున్న తీరుగానే దిగువకు సముద్రంలో కలిసే జలాలను వాడుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తున్నది. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తే చా లా సమయం పడుతుందని సుద్దులు చెప్తున్నది.
బాబుకు రేవంత్‌రెడ్డి సర్కార్ జీహుజూర్
ఏపీ సర్కార్, కేంద్ర ప్రభుత్వ కుట్రలు బాహాటంగా కనిపిస్తున్నా, అవి తెలంగాణ ప్రయోజనాలకు గండికొట్టే వ్యూహాలని తెలిసినా రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ వాటికి వంతపాడుతున్నది. బాబుకు అడుగడుగునా జీ హుజూర్ అంటున్నది. గోదావరిలో వరదపై ఇప్పటివరకు శాస్త్రీయ లెక్కలే లేవు. ఆ లెకలు తేలకుండా కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులకు లింక్ చేయడం అక్రమం. అదీగాక బేసిన్‌లోని రాష్ర్టాల నీటిహక్కులకు తీరని నష్టం వాటిల్లుతుంది. పీఎన్ లింకు మరీ ముఖ్యంగా తెలంగాణకు గొడ్డలిపెట్టులా మారనుంది. తెలంగాణ ఇంకా గోదావరిలో 100 టీఎంసీలకుపైగా హక్కులను సాధించుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులే వేయడం లేదు. ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదు. కొత్త ప్రాజెక్టులను చేపట్టింది లేదు. ఇక బనకచర్ల లింక్‌పై తెలంగాణ సమాజం, రాష్ట్ర నీటిపారుదలశాఖ ఇంజినీర్లు, నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే రేవంత్‌రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తానే చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తానని ప్రకటించారు.
ఆ తరువాత గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలను తెలంగాణకు రాసిస్తే సరిపోతుందని, ఆ తరువాత బనకచర్లను అంగీకరిస్తామని అన్నారు. విమర్శలు రావడంతో ప్రాజెక్టును అడ్డుకుంటామని ఆ తరువాత ప్రకటించినా మళ్లీ మాట మార్చారు. వరద జలాల్లో లెక తేలాక, తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకున్న తరువాత బురద ఉందా.. వరద ఉందో తేలుతుందని, ఎవరేం కట్టాలంటున్నారనేది గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దాం అంటూ డాంబికాలు పలికారు. చట్టబద్ధంగానే బనకచర్లపై పో రాడుతున్నామని, అందరి దగ్గరికీ వెళ్తున్నామని చెప్పారు. కానీ కేంద్రమంత్రి నేతృత్వంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో బాబుతో భేటీ అవడమేగాక, కమిటీ ఏర్పాటుకూ అంగీకరించి వచ్చారు. బీఆర్ఎస్ నిలదీత, తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో మళ్లీ మాటమార్చారు. ఎజెండాలో బనకచర్ల అంశం ఉంటే చర్చలకు రాబోమని లేఖలు రాశా రు. కానీ కేంద్రం ఎలాంటి హామీ ఇవ్వకుండానే తాజాగా నిర్వహించిన చర్చలకు తెలంగాణ సర్కార్ పరుగులు పెట్టింది. ఎజెండాను పంపిస్తామంటూ అంగీకరించి వచ్చింది. ఏపీ సర్కార్ నిర్ణయాలకు రేవంత్‌రెడ్డి సర్కార్ ముందుకుపోతుండడం
గమనార్హం.కక్షగట్టి గోదావరి ట్రిబ్యునల్‌కు ఎత్తుగడ..!
ఏపీ సర్కార్ కక్షగట్టి గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకోసం పట్టుబడుతున్నది. ప్రస్తుతం ఈ అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నది. పోలవరం వద్ద నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) 2023లో హైడ్రాలజీ స్టడీ నిర్వహించింది. పోలవరం వద్ద నీటి లభ్యత 496 టీఎంసీలని లెక్క తేల్చింది. పోలవరం ప్రాజెక్టు నీటి వినియోగాలకు 449.78 టీఎంసీలు సరిపోతాయని స్పష్టంగా పేర్కొంది. అయితే సీడబ్ల్యూసీ లెకలపై ఏపీ అభ్యంతరం తెలిపింది. అక్కడితో ఆగకుండా అసలు గోదావరి నీటి కేటాయింపులే తప్పని కొత్తవాదం ముందుకు తెచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు ఎకువ నీటిని కేటాయించిందని, వాస్తవంగా తమకే ఎకువ వాటా రావాలని వాదిస్తున్నది. మొత్తంగా 1486 టీఎంసీల్లో 850 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నది. పోలవరం వద్ద అవసరాలుపోను మిగులు జలాలతోనే పోలవరం బనకచర్ల, నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టులను చేపడుతున్నామని తాజా సమావేశంలోనూ ప్రకటించింది. అంతేకాదు గతంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన గోదావరి జలాల కేటాయింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పరిగణించవద్దని మొండికేస్తున్నది.