హైదరాబాద్ : తుంగభద్ర ( Tungabhadra ) పై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ( Harish Rao) లేఖ రాశారు.
సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అతిపెద్ద అన్యాయాల్లో నీళ్ల దోపిడీ ఒకటని, కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను దశాబ్దాల పాటు దోచుకోవడంతో లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయని స్పష్టం చేశారు. ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జలాలను తెలంగాణ భూములకు మళ్లించి కరవును పారద్రోలి, పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కళకళలాడేలా చేసిందని వివరించారు.
కాంగ్రెస్ ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోంది
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి, రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను తమ రాష్ట్రానికి మళ్లించే ప్రయత్నం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు పూర్తి సహకారం అందిస్తున్న మీరు, ఇప్పుడు తుంగభద్రపై కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టుల విషయంలో కూడా అదే ద్రోహ బుద్దితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
పాలమూరు బిడ్డనని చెప్పుకునే మీరు, అదే పాలమూరు రైతాంగం భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టడం ఎంత వరకు సమంజసమని లేఖలో ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు కర్ణాటక నుంచి ఎన్వోసి తెస్తున్నాం అనే సాకు చెప్పి, తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చారా అంటూ నిలదీశారు. తుంగభద్రపై కర్ణాటక నిర్మిస్తున్న కురిడి (2 TMC), చిక్కాలపర్వి(2.5 TMC), చిక్కాలమంచి (5 TMC) బ్రిడ్జ్-కమ్-బరాజ్‌లకు కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మతి తెలిపిందా? లేదా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు
2025 జులై 18న కొడంగల్ లిఫ్ట్‌కు కర్ణాటక ఎన్వోసీ ఇవ్వడం వెనుక జరిగిన మతలబు ఏమిటి చెప్పాలని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అనుమతులు లేకుండానే కర్ణాటక తుంగభద్రపై ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే మీరు, మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక తనకు కేటాయించిన పరిమితులను దాటి అదనపు సాగు చేస్తోందని ఆరోపించారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే ఆర్డీఎస్తో పాటు తుమ్మిళ్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని వెల్లడించారు.
చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గ్రావిటీ ద్వారా నారాయణ పేట, కొడంగల్ కు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఉద్దేశ్యపూర్వకంగా దాన్ని పక్కనబెట్టారు. కమీషన్ల కోసం కొడంగల్ లిఫ్ట్ పేరిట భీమా ప్రాజెక్టు ఆయకట్టు రైతుల శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీశారని విమర్శించారు.
తుంగభద్ర నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహాలు తగ్గితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులతో పాటు తాగునీటి అవసరాలు, భవిష్యత్తు నీటి ప్రణాళికలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలి
తుంగభద్రపై కర్ణాటక చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకోవాలని. సీడబ్ల్యూసీ, కేఆర్ఎంబీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు అధికారిక అభ్యంతరాలు తెలియజేయాలని కోరారు. తుంగభద్ర జలాల వినియోగంలో బచావత్ ట్రిబ్యునల్ విధించిన నిబంధనలను కర్ణాటక తు.చ తప్పకుండా పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అవసరం అయితే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులపై సుప్రీం కోర్టులో కేసు వేయాలని, కొడంగల్ లిఫ్ట్ కోసం తెలంగాణ జల హక్కులను బేరసారాల అంశంగా మార్చలేదని ప్రభుత్వం నిరూపించాలన్నారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రతి నీటి చుక్కను కాపాడటం ప్రభుత్వ చట్టబద్దమైన, రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని గుర్తు చేశారు.
స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రతి నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. పాలమూరు రైతాంగం భవిష్యత్తు కోసం, తెలంగాణ జల హక్కులను కాపాడటం కోసం బీఆర్ఎస్ నిర్విరామ పోరాటం చేస్తుందని, ఎంత దూరం దాకా అయినా వెళ్లి కొట్లాడుతుంని హరీష్‌రావు పేర్కొన్నారు.