హైదరాబాద్, జూన్ 5( నమస్తేతెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి హోదాను మరచి, విచక్షణ కోల్పోయి చిల్లర రాజకీయం చేస్తున్నరు. రాజే శ్ ఎక్సోపోర్ట్స్ విషయంలో బీజేపీని వదిలిపెట్టి కేటీఆర్‌ను బద్నాం చేస్తున్నరు. తన అనుకూల మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా శాడిస్టులా దుష్ప్రచారానికి దిగుతున్నరు’ అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి సొంతంగా ఒక్క పెట్టుబడిని తీసుకురాలేని అసమర్థుడని మండిపడ్డారు. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు 24 గంటలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై అనుచిత విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాజేశ్ ఎక్స్పోర్ట్ అంతర్జాతీయ ఖ్యా తి కలిగిన ప్రతిష్టాత్మక కంపెనీ అని కేంద్రమే ఐఎస్ఐ ముద్ర వేసిందని గుర్తుచేశారు.
2022 లో మోదీ సర్కార్ ఈ కంపెనీని దేశంలోని అతిపెద్దదైన రూ.18,100 కోట్ల ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఎంపిక చేసింద ని, రూ. 600 కోట్ల ఎల్ఐసీ నిధులను ఈ కం పెనీలో పెట్టుబడిగా పెట్టేందుకు అనుమతిచ్చిందని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో సెమీ కండక్టర్/చిప్ డిస్ప్లే ఫాబ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేసేందుకు అప్పటి పరిశ్రమలశాఖ మంత్రిగా కేటీఆర్ రాజేశ్ ఎక్స్‌పోర్ట్‌తో ఎంవోయూ చేసుకున్నారని తెలిపారు. కానీ, కంపెనీకి ఒక్క ఇంచుకూడా ఇవ్వలేదని, రాష్ట్ర ఖజానాకు పైనా నష్టం జరుగలేదని, బీఆర్ఎస్ సర్కార్ రూపాయి గ్రాంట్, ఇన్సెంటివ్ ఇవ్వలేదని స్పష్టంచేశారు. సదరు ప్రాజెక్టు సంతకాల దశలోనే ముగిసిపోయిందని గుర్తుచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పెట్టుబడులపై కట్టుకథలు చెబుతున్నారని దాసోజు నిప్పులుచెరిగారు. సొంత తమ్ముడి కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ప్రజాధనాన్ని కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రూ. లక్ష కూడా పెట్టుబడిలేని ‘స్వచ్ఛ్ బయో, గోడీ మీడియా’ లాంటి షెల్ కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకున్న ఘన త ఆయనకే దక్కిందని ఎద్దేవాచేశారు. ప్రజల సొమ్ముతో దావోస్‌లో జల్సాలు చేయడం త ప్ప చేసిందేమీ లేదని దెప్పిపొడిచారు. దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో పారదర్శక పెట్టుబడులే లక్ష్యంగా తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్, డాష్‌బోర్డుకు రేవంత్ సర్కార్ పాతరేసిందని విమర్శించారు. కేటీఆర్.. రూ.50 వేల కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులను రూ.3 లక్షల కోట్లకు చేర్చారని ప్రశంసించారు. ఇప్పటికైనా ప్రగల్భాలు, తప్పుడు ఆరోపణలు మాని పాలనపై దృష్టిపెట్టాలని హితవుపలికారు.
రాజేశ్ ఎక్స్పోర్ట్ కంపెనీకి భూములు కట్టబెట్టారని, ఖజానా దోచిపెట్టారని సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లోని మీడియా దుష్ప్రచారం దుర్మార్గమని దాసోజు ఖండించారు. మరీ ఫేక్ కంపెనీకి ప్రధాని మోదీ భారీ ప్యాకేజీలు ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి బీజేపీని, తన బడే భాయ్‌ను ప్రశ్నించే దమ్మున్నదా? అని నిలదీశారు. ఢిల్లీకి పోయి బడే భాయ్‌కు దండాలు పెడ్తూ ఇక్కడ కేటీఆర్‌పై బురదజల్లడం శోచనీయమన్నారు.