అబద్ధాన్ని ఎల్లకాలం దాచలేరు. అందర్నీ అన్నిసార్లూ మోసం చేయలేరు. తెలంగాణ రైతులకు భరోసా అంటూ కాంగ్రెస్ చేసిన ‘గ్యారెంటీ’ మోసం గుట్టు పీసీసీ చీఫ్ రేవంత్ నోటే బట్టబయలయింది. మాజీ ఎమ్మెల్సీ, పాత్రికేయుడు ప్రొ.నాగేశ్వర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రైతు భరోసా మోసాన్ని తనంతట తానే బయటపెట్టారు. తనకే అర్థం కాని రీతిలో ఏదేదో మాట్లాడి నవ్వులపాలయ్యారు!
Rythu Bharosa | హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఆరు హామీల్లోని డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నది. కాంగ్రెస్ హామీలన్నీ మోసమేనని సీఎం కేసీఆర్ చెప్తున్నది నిజమేనని పోలింగ్‌కు ముందే తేలిపోతున్నది. 24 గంటల కరెంటు అని మ్యానిఫెస్టోలో పెట్టి.. మూడు గంటలే ఇస్తామని పీసీసీ చీఫ్ ఇప్పటికే తేల్చేశారు. ఇప్పుడు మరో గ్యారెంటీ కూడా అబద్ధమేనని ఆయన నోటివెంటనే నిజం బయటకు వచ్చింది. రైతు భరోసా కింద ఆర్థికసాయం భూ యజమాని, కౌలుదారుల్లో ఎవరో ఒక్కరికే ఇస్తామని రేవంత్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో ఇంటర్వ్యూలో రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని బయటపెట్టేశారు. ‘రైతు భరోసా సాయం రైతు (భూ యజమాని)కు వస్తే కౌలు రైతుకు రాదు, కౌలు రైతుకు వస్తే రైతుకు రాదు’ అని కుండబద్ధలు కొట్టారు. ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే వచ్చేలా, ఓవర్లాప్స్ కాకుండా ఉండేందుకు మొత్తం రికార్డులను కంప్యూటీకరిస్తామని కూడా రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రైతుభరోసా రాని కౌలు రైతులకు ఉపాధి కూలీల పథకం కింద సాయం అందిస్తామని తెలిపారు.
కౌలు లేకుండా కౌలుకు భూమి
రైతు భరోసాలో భాగంగా ఉపాధి కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడేమో భూ యజమాని ఒప్పుకొంటేనే ఆ రూ.15,000 ఇస్తామని సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడే చెప్తున్నాడు. సాధారణంగా రాష్ట్రంలో ఎకరానికి కౌలు కూడా రూ.15 వేలకు అటు ఇటుగానే ఉంటున్నది. అంటే రైతు తన భూమిని కౌలుకు ఇస్తే.. అది సాగుచేసే కౌలు రైతు తనకు ఆ భూమిపై వచ్చే రూ.15 వేల రైతు భరోసాను తెచ్చి రైతుకు కౌలుకింద చెల్లిస్తాడు. అప్పుడు కౌలు రైతు ఆ భూమిని కౌలు లేకుండా ఉచితంగానే పొందినట్టు అవుతుంది. అలా ఎక్కడైనా, ఏ భూ యజమాని అయినా తన భూమిని ఉచితంగా సాగుచేసుకొమ్మని రాసిస్తారా? కాంగ్రెస్ ఇస్తానంటున్న ఆ రూ.15 వేలేదో తానే తీసుకొని.. తన భూమిని పడావు అయినా పెట్టుకొంటారు కానీ.. కౌలుకు ఇవ్వరు. అప్పుడు కౌలు రైతుకు చేయటానికి భూమి దొరకదు. వ్యవసాయ యోగ్యమైన భూమి పడావు పడి పంటలు పండవు.
అంటే కాంగ్రెస్ ప్రకటించిన రైతు భరోసా వల్ల అటు కౌలు రైతు కూలీగా మారటం.. ఇటు సాగు లేక భూములు పడావు పడటం ఖాయం. ఇదే ఆ పథకం గొప్పతనం. ఒకవేళ ఉపాధి హామీ జాబ్ కార్డు లేకపోతే కౌలు రైతుల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని సగానికి సగం కుదించే పనిలో ఉన్నది. పనిదినాలను తగ్గించేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త జాబ్‌కార్డుల జారీ కూడా అనుమానమే. అప్పుడు కౌలు రైతుకు కూలీ కూడా దొరకని పరిస్థితి దాపురిస్తుంది. వారి కుటుంబాలు పస్తులతో నకనకలాడాల్సి వస్తుంది. వాస్తవంగా కౌలు రైతులకు కాంగ్రెస్ చేస్తానంటున్న మేలు ఇదేనన్నమాట. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధుతో భూ యజమానికి రెండురకాల ప్రయోజనం అందుతున్నది. ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు డబ్బుతోపాటు భూమిని కౌలుకు ఇస్తే వచ్చే కౌలు కూడా భూ యజమానికి లభిస్తున్నది. అదే సమయంలో సాగుచేసుకొనేందుకు కౌలు రైతులకు పుష్కలంగా భూమి లభిస్తున్నది. ఈ విధంగా కౌలు రైతు కూడా బాగుపడుతున్నాడు.
రైతుల మధ్య కొట్లాటలు పెట్టే కుట్ర
ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో రైతుల మధ్య కొట్లాటలు పెట్టే విధంగా కాంగ్రెస్ రైతు భరోసా ఉన్నది. సాంకేతిక కారణాల వల్ల కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించడం సాధ్యం కాదని, ఒకవేళ చేసినా అది రైతుల మధ్య గొడవలకు దారి తీస్తుందని సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎవరేమైనా సరే ఎన్నికల్లో గెలవడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని భవిష్యత్తు పరిణామాలను గుర్తించటం లేదు. కౌలు రైతులకు, రైతులకు రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పి గ్రామాల్లో వారి మధ్య కొత్త పంచాయితీలకు ఆజ్యం పోస్తున్నది. రైతు భరోసా కోసం గ్రామాల్లో మళ్లీ గొడవలు చెలరేగే ప్రమాదం ఉన్నది. ఇదిలా ఉంటే కౌలు రైతులను గుర్తించేందుకు పెద్ద తతంగాన్ని పెడుతున్నది. రైతు, కౌలు రైతు మధ్య ఒప్పందం ఉండాలనేది మొదటి షరతు. దీంతోపాటు గ్రామ సభలో ఈ ఒప్పందంపై తీర్మానం చేయాలట. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టంలోని నిబంధనలన్నీ వర్తిస్తేనే కౌలు రైతుకు రైతు భరోసా ఇస్తామని మరో షరతు పెట్టబోతున్నామని రేవంత్ చెప్పారు. అంటే కౌలు రైతుకు రైతు భరోసా నిధులు ఇవ్వడానికి రైతుతోపాటు కౌలు రైతు చట్టంలోని నిబంధనలు కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది.
కర్ణాటకలో అటకెక్కిన హామీలు
కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలోనూ ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీల అమలును అటకెక్కించేసింది. మరీ ముఖ్యంగా కరెంట్ విషయంలో అక్కడి రైతులు, పరిశ్రమలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఎన్నికలకు ముందు ఏడు గంటల నిరంతర విద్యుత్తు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ పార్టీ, నాలుగైదు గంటలు.. అది కూడా రెండుమూడు దఫాలుగా ఇస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒప్పుకొన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదని కూడా సెలవిచ్చారు. పొరపాటున ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కర్ణాటకకంటే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది.
బీఆర్ఎస్తో 30 వేలు!
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుతో రైతుకు ఎకరానికి ఏడాదికి ప్రస్తుతానికి 10 వేలు, మున్ముందు 16 వేలు పెట్టుబడి సాయం అందుతుంది. రైతు ఒకవేళ తనభూమిని కౌలుకు ఇస్తే అదనంగా ఎంతోకొంత (దాదాపు 15వేలు) కౌలుమొత్తం వస్తుంది. ఈ లెక్కన రైతుకు ఎకరానికి 30వేలు లభిస్తుంది.
కాంగ్రెస్‌తో 15 వేలు!
రేవంత్ చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్ రైతుభరోసాతో రైతుకు అయితే పెట్టుబడి సాయం, లేదంటే కౌలు .. ఏదో ఒకటే లభిస్తుంది. అంటే రైతు ఒకదాన్ని కోల్పోవాల్సి ఉంటుంది.
నాగేశ్వర్: రైతుభరోసా మీద ఇంపార్టెంట్ కామెంట్ ఒకటి వినిపిస్తున్నది. కౌలుదార్లకు ఇవ్వడం అంటూ మొదలుపెడితే భూయజమానులకు భయం మొదలవుతది. కౌలుదార్లకు చట్టాలున్నయ్.
కౌలుకు ఇస్తే భూమి ఎక్కడ పోతుందోనని రేపు యజమానులకు భయం రాదా?
రేవంత్: మేం విస్పష్టంగా చెప్పినం. భూ యజమానికి ఇస్తం. గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి.. కౌలుదార్లు ఎవరు? ఏ భూమి కౌలుకు తీసుకున్నరు? వారి ఒప్పంద పత్రాలను చూసి గ్రామసభల్లో ఆమోదించిన తర్వాత తెలిసిపోతది.
నాగేశ్వర్: కౌలుకు ఒప్పంద పత్రాలుండవు కదా?
రేవంత్: లేదు. వాళ్లు ఏదైతే కౌలుకు మాట్లాడుకుంటరో అదే ఒప్పందం. 2011లో కాంగ్రెస్ పార్టీ కౌలుదార్ల చట్టమే తెచ్చింది. దానిప్రకారం కౌలుదార్లను గుర్తిస్తం. యజమానికి రావాల్సింది యజమాని ఖాతాలో పడుతది. కౌలురైతుకు రావాల్సింది కౌలుదారుకు వస్తది. భూమిలేని వాళ్లు ఉపాధి కూలీకి పోయేవారికి కూడా మేం మద్దతు ఇచ్చేలా ఇందులో పెట్టినం.
నాగేశ్వర్: సో.. ఈ లెక్కన అందరికీ ఇస్తరు?
రేవంత్: ఆల్మోస్ట్ అందరికీ ఇస్తం.
నాగేశ్వర్ : అప్పుడు డబుల్ డబుల్ పడుతది కదా?
రేవంత్: లేదు. ఓవర్లాప్ కాదు. వాళ్లకు వస్తే వీళ్లకు రాదు. వీళ్లకు వస్తే వాళ్లకు రాదు. ఎక్కడోదగ్గర అడ్జస్ట్ అవుతుంది కాబట్టి, హార్ట్‌బర్న్ ఉండదు. ఒకవేళ కౌలురైతులకు రాకపోతే, ఉపాధిహామీ కూలీల కింద వాళ్లకు ఆటోమేటిక్‌గా ఇస్తం. రైతు ఒప్పుకోకపోతే రైతుకు నష్టంచేయాల్సిన అవసరమే లేదు. ఇయ్యాల భూమి లేనివాళ్లకు కూడా 12వేల రూపాయలు ఆల్రెడీ ప్రకటించినం కదా. ఓవర్లాప్ లేకుండా కంప్యూటరైజ్ చేస్తాం కాబట్టి సమస్యనేలేదు.
రెండు నాల్కల ధోరణి తగదు
కాంగ్రెస్ అధికారంలోకొస్తే అనే ఆలోచనతోనే భయమవుతున్నది. ఎందుకంటే రైతుభరోసాపై కాంగ్రెస్ నేతలు చేసిన ప్రకటన హడల్ పుట్టిస్తున్నది. భూమి ఉన్న వారికి రైతుభరోసా ఇస్తే కౌలు రైతులకు ఇవ్వరంట.. కౌలు రైతులకు ఇస్తే భూమి పట్టా ఉన్న యజమానికి ఇవ్వరంట. కాంగ్రెస్ గెలవదు కానీ.. తప్పిదారి గెలిస్తే వారి పరిపాలన ఎలా ఉంటుందో ఈ రోజు రేవంత్‌రెడ్డి మాటలతో అర్థమవుతుంది. కాంగ్రెస్ వస్తే అన్నింటికీ కోతలే ఏర్పడే అవకాశం ఉన్నది. మాకు నాలుగు కిలోమీటర్లు దాటితే కర్ణాటక రాష్ట్రం గ్రామాలు ఉన్నాయి. అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కరెంట్ సరిగ్గా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రైతులు, ఓటర్లు బాగా ఆలోచించి ఓట్లు వేయాలి. లేకపోతే కర్ణాటక రైతులకు పట్టిన గతే మనకు పడుతుంది.
-శెట్టి శ్రీనివాస్, రైతు, దామరగిద్ద మండలం, నారాయణపేట జిల్లా
ఓటుతోనే కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలె
తెలంగాణ అచ్చినంకనే ఎవుసం పండుగైంది. రైతులందరూ సంతోషంగా రెండు పంటలు పండించుకొంటున్నరు. కానీ కాంగ్రెసోళ్లు ఎన్నికలు రాంగనే రైతులకు ఇది చేస్తం..అది చేస్తం అంటూ ఊదరగొడుతున్నరు. వాళ్లు ఇచ్చిన గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామనే నమ్మకం వాళ్లకే లేదు. ఇక జనానికి ఏముంటుంది. కౌలు రైతుకు ఏదో మేలు చేస్తామని అనుకుంటన్నది కాంగ్రెస్. కానీ వాళ్ల తెలివిలేని నిర్ణయాలతో కౌలు రైతుకే కష్టాలు తెస్తరు. రైతుభరోసా కౌలురైతుకిస్తే కౌలుకిచ్చటోళ్లు కౌలు పెంచరా? రైతులను మోసం చేసే కాంగ్రెస్‌కు ఓటు ద్వారా బుద్ది చెప్పాలె.
-ఏ రాజేశ్వరి, మహిళా రైతు, మియాపూర్, సుల్తానాబాద్ మండలం(పెద్దపల్లి)
ఎవుసాన్ని ఆగం చేయాలని సూత్తాండు
రేవంత్‌రెడ్డి ఎవుసాన్ని ఆగం చేయాలని సూత్తాండు. రైతుభరోసా పథకంపై పూటకో మాట మాట్లాడుకుంట పరేషాన్ చేత్తాండు. ఓ సారి కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇస్తా అంటడు. మరోసారి ఇయ్య అంటడు. యజామానికో, కౌలురైతుకో ఎవరికో ఒక్కలకే ఇస్తా అంటడు.. ఇలాంటి మతిలేని వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి అసలు రంగు బయటపడ్డది. దీని మీదనే ఇట్లా అంటే కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉత్తిత్తియే అని తెలుస్తాంది. ప్రజలను మభ్యపెట్టడానికే అని అర్థమతాంది. కాంగ్రెస్ విధానాలతో రైతులకు ఎలాంటి మేలు జరగదు. ఆ పార్టీని బొందపెడితే పీడ పోతది.- ఆయిల్ల సమ్మయ్య, కౌలు రైతు, ఎడపల్లి ,మహదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి
కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దు
భూమి యజమాని, కౌలు రైతులకూ రైతుభరోసా ఇస్తామని మొదట చెప్పి ఇప్పుడు మాట మార్చడం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికే చెల్లింది. రైతుల విషయంలో కాంగ్రెస్ నేతలు రెండు నాలుకల ధోరణి అవలంభిస్తున్నారు. రేవంత్‌కు రైతులపై ఉన్న కపటప్రేమ చూపిస్తున్నారని అర్థమైంది. కర్షకుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొన్నారని, ఇవ్వని హామీ కూడా నెరవేర్చి రైతుబాంధవుడయ్యారు. కానీ, పూటకోమాట మాట్లాడుతూ పబ్బం గడుపుతున్న కాంగ్రెస్‌కు రైతులే గుణపాఠం చెప్పాలి. కౌలు రైతులను మోసం చేసేందుకు ఆ పార్టీ పని గట్టుకున్నది. కాంగ్రెస్ మాయమాటలు, వాగ్ధానాలను నమ్మి మోసపోవద్దు.
– కుడికిళ్ల నాగేశ్వర్‌రెడ్డి, రైతు సంఘం గ్రామ అధ్యక్షుడు, కనిమెట్ట, వనపర్తి జిల్లా
రేవంత్‌వి రైతులను ముంచే మాటలు
భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే రైతుభరోసా ఇస్తామని రేవంత్‌రెడ్డి మాట మారుస్తున్నడు. భూమి యజమానికిస్తే కౌలు రైతుకు రాదని.. కౌలు రైతుకిస్తే భూ యజమానికి రాదని అయోమయం చేస్తున్నడు. ఇప్పుడే ఇన్ని మాటలు మాట్లాడుతున్నరు.. ఇక అధికారంలకు వస్తే ఎన్ని ఏషాలేస్తరో?. రైతులు వాళ్లకు నచ్చిన విధంగా కౌలుకు ఇస్తారు. ఇలాంటప్పుడు రికార్డులో ఎలా పొందుపరుస్తరు.. రైతు భరోసా ఎట్లా ఇస్తరు. కాంగ్రెస్ వాళ్లు చెప్పిన విధంగా చేస్తే కౌలుకు ఇవ్వడానికి యజమానులు ఎవరూ ముందుకురారు. ఇటు భూ యజమానులను అటు కౌలు రైతులను కాంగ్రెస్ వాళ్లు నట్టేట ముంచాలని చూస్తున్నరు. వాళ్ల మాటలు నమ్మి ఓటేస్తే రైతులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తది. రైతులు ఆలోచించాలి.
– కళ్లెం లక్ష్మిరెడ్డి, రైతు, చొప్పదండి, కరీంనగర్ జిల్లా
రేవంత్‌వన్నీ దొంగ మాటలే
రైతుభరోసా విషయంలో కాంగ్రెస్ నేతల దొంగ మాటలు బట్టబయలయ్యాయి. భూ యజమానికి, కౌలు రైతుల మధ్య కొత్త పంచాయితీ పెట్టే కుట్రకు తెరలేపారు. ఇదంతా తెలంగాణ రైతాంగం గమనించాలి. రైతుల మధ్య పంచాయితీ పెట్టడానికే ధరణి తీసేసి కౌలు కాలం తేవడానికి ప్రయత్నిస్తున్నారు. కౌలు కాలం తెస్తే మూడేండ్ల పాటు ఒకరి భూమిని మరొకరు కౌలు చేసుకొంటే తదుపరి ఆ భూమి కౌలుదారునికే చెందుతుంది. అప్పుడు భూ పంచాయితీలతో రైతులు కొట్టుకు చావాల్సి వస్తుంది. మొదట్లో రైతుబంధు దండగ అని చెప్పి.. ఇప్పుడు ఓట్ల కోసం యజమానికి, కౌలు రైతుకు సాయం చేస్తాం అని కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. రైతులంతా కారు గుర్తుపై ఓటేసి రాష్ర్టానికి మంచి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలి.
– గుండ్ల నాగయ్య, కుంటపల్లి, మద్దిరాల మండల, సూర్యాపేట జిల్లా
రేవంత్‌ది పూటకో మాట
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందొకటి. ఇప్పుడు చెబుతున్నది మరొకటి. ఇదేం పద్ధతి రేవంత్‌రెడ్డీ. రైతు భరోసా కింద కౌలు రైతులకు రూ. 15 వేలు, కూలీలకు 12వేలు ఇస్తమంటిరి. ఇప్పుడు యజమానికిస్తే.. కౌలు రైతులకు లేదు. కౌలు రైతులకిస్తే.. యజమానికి లేదంటున్నవ్. రైతుభరోసా ఏడాదికి రూ.15 వేలా, ఎకరానికి రూ.15 వేలా.. తెలుస్తలేదు. కౌలు రైతులకు సాయం చేస్తే భూ యాజమానికి ఎలాంటి ఆర్థిక సాయం లేదంటున్నావ్. అంటే రైతులను మోసం చేసేందుకు కుట్రను ముందుగానే చెప్పినవ్. రైతులు ఇప్పటికైనా ఆర్థం చేసుకోవాలి.
– యల్లు మధుసూదన్‌రెడ్డి, రైతు, నర్సింహులపేట(మహబూబాబాద్)
రైతు భరోసాపై కాంగ్రెస్‌వి ఊసరవెల్లి మాటలు
రైతుభరోసాపై కాంగ్రెస్ నాయకులు అప్పుడే ఊసరవెల్లి మాటలు మాట్లాడుతుండ్రు. భూ యజమానికి రైతుభరోసా వస్తే కౌలు రైతుకు రాదని, కౌలు రైతుకు ఇస్తే భూ యజమానికి రాదని స్వయంగా రేవంత్‌రెడ్డి చెప్తున్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ర్టాన్ని రావణకాష్టం చేసేలా మాట్లాడుతున్నారు. భూ యజమానికి, కౌలు రైతులకు తగాదా పెట్టేలా వారి నిర్ణయాలున్నాయి. వారి మ్యానిఫెస్టోలో కూడా రైతుకు సంవత్సరానికి రూ.15వేలు అన్నారు కానీ.. ఎకరానికి రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పలేదు. రైతులు మోసపోవడానికి సిద్ధంగా లేరు. రైతును రాజును చేసిన కేసీఆర్ వెంటే ఉంటారు.
– పాదూరి సంజీవ్‌రెడ్డి, రైతు, తడకమళ్ల, మిర్యాలగూడ మండలం, నల్లగొండ జిల్లా