ధర్మారం : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ( BC reservations ) పై ఢిల్లీలో ఈనెల 6న జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ చేపట్టదలచిన ధర్నా అంతా బూటకం.. నాటకమని( Drama ) బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాం చందర్ రావు (Ram Chandra Rao) విమర్శించారు. పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ పార్టీకి , రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని సాకు చూపి దానిని బీజేపీ (BJP) ప్రభుత్వంపై నెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ని బీసీలు నమ్మే ప్రసక్తేలేదన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేసిన కాంగ్రెస్ అందులో నుంచి 10 శాతం ముస్లింలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ చేయనున్న ధర్నా కూడా జంతర్ మంతర్ లాంటిదేనని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆ పార్టీ అగ్ర నేత దివంగత రాజీవ్ గాంధీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎందుకు ఆలోచించలేకపోయారని పేర్కొన్నారు. దీనిని బట్టి ఆ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుందని ఆరోపించారు. కేంద్ర క్యాబినెట్లో 27 మంది బీసీ మంత్రులు పదవుల్లో ఉండడం ఒక ఉదాహరణ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, రాష్ట్ర పార్టీ నాయకుడు గోమాస శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, కాసిపేట లింగయ్య, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి, యాదగిరి బాబు, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, నాయకులు మోరపల్లి సత్యనారాయణ, తాడ్వాయి రాంగోపాల్ రెడ్డి ,గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి , మేడవేని శ్రీనివాస్, సంధినేని లక్ష్మణ్, కర్రే లక్ష్మణ్, యాళ్ల తిరుపతిరెడ్డి, గుండా సత్యనారాయణ రెడ్డి, గుండా వెంకట్ రెడ్డి, బైరి శేఖర్, దేవి రాజలింగయ్య, దేవి కొమరేష్ పాల్గొన్నారు.