హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ప్రచారాస్త్రం ఆరు గ్యారెంటీలు. పేరుకే ఇవి ఆరు గ్యారెంటీలు అయినా మొత్తం 13 హామీలు ఇచ్చింది. ప్రతీ వేదికలోనూ, ప్రతి నాయకుడి నోట గ్యారెంటీల జపమే వినిపించింది. ఎన్నికల సమయంలోనే లక్షలాది కుటుంబాలకు గ్యారెంటీ కార్డులు పంచింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా హామీలన్నీ అమలు చేస్తామంటూ ప్రజలను నమ్మించింది. రైతులు, యువత, మహిళలు, బీసీ ఇలా అన్ని వర్గాలను మభ్యపెట్టేలా మ్యానిఫెస్టో, డిక్లరేషన్లను ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా గ్యారెంటీల అమలును అటకెక్కించింది.
చెప్పింది కొండంత.. చేసింది గోరంతకాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 13 హామీల్లో ఇప్పటివరకు అమలు చేసింది 6 మాత్రమే. ఇందులో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు మాత్రమే అమలవుతున్నాయి. మిగతా హామీలైన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పంటకు రూ.500 బోనస్, మండలానికో ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు హామీలు తూతూమంత్రంగా మారాయి.
గ్యారెంటీలు, అమలు స్థితి గ్యారెంటీ-1: మహాలక్ష్మి
హామీ 1- రాష్ట్రంలో 18 ఏండ్లకు పైబడిన ప్రతీ మహిళకు నెలకు రూ.2500 బ్యాంకు ఖాతాలో జమ
అమలు పరిస్థితి: అమలు కాలేదు
హామీ-2: తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం
అమలు పరిస్థితి: అరకొరగా అవుతున్నది. తెల్లరేషన్ కార్డు ఉండి, గ్యాస్ కనెక్షన్ ఉన్నవాళ్లు రాష్ట్రంలో 63 లక్షల మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కానీ ప్రభుత్వం 40 లక్షల మందికే రాయితీ ఇస్తున్నది
హామీ-3: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
అమలు పరిస్థితి: అమలు అవుతున్నది
గ్యారెంటీ-2: రైతు భరోసా
హామీ -1: ఏటా రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.15 వేలు అందజేస్తాం
అమలు పరిస్థితి: అమలు కాలేదు
హామీ-2: వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12వేలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తాం
అమలు పరిస్థితి: అమలు కాలేదు
హామీ-3: వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్
అమలు పరిస్థితి: అరకొరగా అమలు. బోనస్ సన్నవడ్లకే పరిమితమైంది. యాసంగి పంటకు బోనస్ ఇవ్వనేలేదు.
గ్యారంటీ-3: గృహజ్యోతి
అమలు పరిస్థితి: అరకొరగా అమలు. రాష్ట్రంలో 90 లక్షలకుపైగా రేషన్‌కార్డులు ఉన్నాయి. కానీ 42 లక్షల మందికి మాత్రమే గృహజ్యోతి అమలు అవుతున్నట్టు విద్యుత్‌శాఖ వర్గాలు చెప్తున్నాయి.
రేషన్‌కార్డు ఉన్న ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పంపిణీ
గ్యారెంటీ 4: ఇందిరమ్మ ఇండ్లు
అమలు పరిస్థితి: అమలు కాలేదు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించినా కనీసం లబ్ధిదారుల ఎంపిక కూడా జరగలేదు.
హామీ-1: ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి
రూ.5 లక్షలు ఆర్థిక సాయం.
హామీ 2: తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం
గ్యారెంటీ 5: యువవికాసం
హామీ1: విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు
అమలు పరిస్థితి: అమలు కాలేదు
హామీ 2: ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ సూళ్ల ఏర్పాటు
అమలు పరిస్థితి: అరకొరగా అమలు. ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని చెప్తున్నది. విడతలవారీగా మంజూరు చేస్తున్నది. మొదటి విడతలో 28 స్కూళ్లు మంజూరు కాగా డిసెంబర్ 1న రెండో విడతకు శంకుస్థాపన చేయనున్నారు.
గ్యారెంటీ 6: చేయూత
హామీ-1: వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పింఛన్ రూ.4వేలకు పెంచుతాం
అమలు పరిస్థితి: అమలు కాలేదు
హామీ-2: ఆరోగ్యశ్రీ కవరేజీని 10 లక్షలకు పెంచి, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాగా అమలు
అమలు పరిస్థితి: అమలు అవుతున్నది.