పెద్దపల్లి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పార్టీని తన జేబు సంస్థగా మార్చుకున్నారని టీపీసీసీ స్ట్రాటజిక్ కమిటీ సభ్యుడు, ఓదెల జడ్పీటీసీ గంటా రాములుయాదవ్, మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నేత సీ సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి, సీనియర్ నాయకుడు హజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, అవమానించి, ఆత్మాభిమానాన్ని చంపి పార్టీ నుంచి బయటికి పంపే కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్‌లో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలుచేస్తూ వారితోపాటు మరో 20 మంది కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తమ బాధలు చెప్పే అవకాశం కూడా లేదని వాపోయారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్వేలన్నీ రేవంత్‌రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకొంటున్నారని విమర్శించారు. సీనియర్లను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కలుపుకొని పోకుండా ఒక పర్సనల్ ఎజెండాతో వచ్చి ఆయన పార్టీని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరైతే టికెట్ రేసులో ఉంటారో అలాంటి వారిని రేవంత్‌రెడ్డి పక్కకు తప్పించడం, తన వారికి అనుకూలంగా రిపోర్టులు తెప్పించుకొని డబ్బులు ఉన్న వారికే టికెట్లు ఇవ్వడం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఆత్మాభిమానం లేని చోట, అవమానం జరిగిన చోట తాము ఉండబోమని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి మద్దతుతో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి విజయరమణారావు విర్రవీగుతున్నారని విమర్శించారు. పెద్దపదల్లి జిల్లాలో రాహుల్‌గాంధీ పర్యటించినా ఒరిగేదేమీ లేదని, రాహుల్ మాట్లాడేదంతా రేవంత్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్టేనని పేర్కొన్నారు. ప్రజల ఆమోదంతో ఎదుగుతున్న తమపై కుట్రలు, కుతంత్రాలకు దిగుతున్నారని విమర్శించారు. తాము, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మరికొంత మందిని కలుపుకొని త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. మంథని, పెద్దపల్లి నియోజకవర్గాల్లో గురువారం రాహుల్‌గాంధీ పర్యటిస్తున్న నేపథ్యంలో పార్టీ సీనియర్ నాయకులంతా ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేయడం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.