వరంగల్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యూరియా కొరతపై నిలదీసిన రైతుపై కాంగ్రెస్ కార్యకర్తలు పిడిగుద్దులతో దాడిచేసిన ఘటన సోమవారం రాత్రి వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటుచేసుకున్నది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఇల్లంద నుంచి వర్దన్నపేట వరకు (3 కిలోమీటర్లు) జనహిత పాదయాత్ర సోమవారం రాత్రి 7.45కు పాదయాత్ర మొదలైంది. రాత్రి 9 గంటలకు వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఓ యువ గిరిజన రైతు ‘యూరియా దొరుకుతలేదు..యాడికి పోవాలె?’ అని ప్రశ్నించారు. వెంటనే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అతడి గల్లాపట్టి తోసేసి పిడిగుద్దులు గుద్దుతూ లాక్కెళ్లిపోయారు.
రాత్రి వరకు ఆ రైతు ఆచూకీ దొరకకుండా చేశారు. దీనిపై ఆరా తీసిన మీడియా ప్రతినిధులను మా కార్యకర్తతో మీకేం పని అంటూ ఎదురు ప్రశ్నించారు. దాడి సమయంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆగండి.. అంటూ సైగ చేసినా కార్యకర్తలు వినలేదు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఆరా తీసే ప్రయత్నం చేసే క్రమంలో వెనకాల ఉన్న హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ‘ముందుకు చూడండి’ అన్నట్టు సైగ చేయడం గమనార్హం. ఇదంతా సాగుతుండగా ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపారు. ‘యూరియాను కొంతమంది బ్లాక్ చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. జనహిత యాత్రలో రైతులు యూరియా కోసం నిలదీశారనేందుకు ఆమె వ్యాఖ్యలే నిదర్శనం. ఆ తరువాత మంత్రి కొండా సురేఖ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ యువరైతు కోసం మీడియా ఆరా తీస్తున్న క్రమంలో ‘ఏమీ లేదు.. ఏమీలేదు..మా వోడే.. కొద్దిగా డ్రింక్ మీదున్నాడు’ అంటూ దాటవేయటం గమనార్హం. ఆ తరువాత మంత్రి కొండా సురేఖ మాట్లాడారు.