Congress | హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నీటిపారుదలశాఖలో ఏ పోస్ట్ అయినా పైరవీలే రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులనే లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఇంజినీర్లపై ఒత్తిళ్లు చేస్తున్నారని తెలుస్తున్నది. ఎమ్మెల్యేలు చేస్తున్న పైరవీలతో ఇంజినీర్లు దిక్కుతోచని దుస్థితిలో పడిపోయారని ఆశాఖలో చర్చ నడుస్తున్నది. నీటివృథాను అరికట్టడంలో ప్రాజెక్టులు, కాలువలు, చెరువుల తూముల గేట్లు, షట్టర్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఆయా గేట్లలో ఎలాంటి చిన్న లోపం తలెత్తినా ప్రాజెక్టులోని నీరు లీకవుతుంది. నీరు నిల్వ ఉండకుండా పోతుంది. ఉమ్మడి పాలనలో పర్యవేక్షణ కొరవడడంతో చాలా చోట్ల గేట్లు, తూములు తుప్పుపట్టాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 4వేల వరకు తూములను నిర్మించింది. వీటి నిరంతర పర్యవేక్షణ కోసం రెవెన్యూశాఖలోని 5073 మంది వీఆర్ఏలను లష్కర్లుగా, హెల్పర్లుగా నియమించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఔట్సోర్సింగ్ పద్ధతిలో 1597మంది లష్కర్లు, 281మంది హెల్పర్లను నియమించాలని నిర్ణయించింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తలనొప్పి!
లష్కర్లు, హెల్పర్ల నియామకం కోసం టెరిటోరియల్ సీఈల నేతృత్వంలో ప్రభుత్వం స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేసింది. 45 ఏళ్లలోపు వయస్సు ఉండి, చదవడం, రాయడం వచ్చిన, ప్రాజెక్టుల సమీప గ్రామాల వారినే ఎంపిక చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. వారికి నెలకు కనీస రూ.15వేల వరకు వేతనం చెల్లించాలని నిర్ణయించింది. కానీ స్థానికంగా ఎవరూ నిబంధనలు పాటించడం లేదని ఇంజినీర్లు వాపోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు, దిగువస్థాయి నాయకుల నుంచి కూడా పైరవీలు వస్తున్నాయని, పైరవీలకు కొందరు మంత్రులు కూడా వత్తాలు పలుకుతున్నారని వాపోతున్నారు. ఒత్తిళ్లను తట్టుకోలేక, నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లలేక తమ పరిధిలోని లష్కర్ల నియామకాన్నే పక్కనపెట్టినట్టు కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.