సిరిసిల్ల రూరల్, జూలై 13: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇంటి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన కాంగ్రెస్ కార్యకర్త భరణ్ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. జిల్లెల్ల గ్రామంలో కేసీఆర్ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో 27డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. అనివార్య కారణాలతో పంపిణీ వాయిదా పడింది. ఈ క్రమంలో అధికారులు లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ కార్యక్రమాన్ని శనివారం తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో భరణ్ ఆందోళన చెందాడు. కార్యాలయ ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపాడు. ఈక్రమంలో మనస్తాపానికి గురై పురుగుల మందు డబ్బాతో హల్చల్ చేశాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన భరణ్ ఉన్న స్థలానికి వెళ్లి కాపాడారు. అతడికి నచ్చజెప్పి ఇంటికి తీసుకువచ్చారు.