హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి శల్య సారథ్యం వహిస్తున్నట్టు కనిపిస్తున్నది. మనుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవనే గెలవదని శాపనార్థాలు పెడుతున్నారు. తన ప్రత్యర్థి పార్టీ తరఫున పోటీ చేస్తున్న తమ్ముడిని ఎలాగైనా గెలిపించుకోవాలని భావిస్తున్న వెంకటరెడ్డి తాను సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గండి కొట్టాలని చూస్తున్నారు. రెండురోజుల క్రితం తన తమ్ముడికి ఓటేయాలంటూ సొంత పార్టీ కార్యకర్తకే ఫోన్ చేసి కోరిన వెంకటరెడ్డి, ఇప్పుడు ఏకంగా తన పార్టీ గెలవదని తీర్మానించేశారు. ‘మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలవదు’ అంటూ
ఎన్నికల ఫలితాన్ని ప్రకటించేశారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన ఆయన శనివారం మెల్బోర్న్ విమానాశ్రయంలో తనను కలిసిన వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదని, తాను ప్రచారం చేస్తే కొన్ని ఓట్లు ఎక్కువగా వస్తాయేమో తప్ప గెలవడం అసాధ్యమని స్పష్టం చేశారు. ఓడిపోయే సీటుకు ప్రచారం చేయడం ఎందుకన్న ఉద్దేశంతోనే తాను పాల్గొనడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొద్దామనుకున్నానని, కానీ ఎవరూ సహకరించే పరిస్థితి లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా విడిపోయిందని, ఒక్కో గ్రూపునకు ఒక్కో నాయకుడున్నాడని తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ ఓడిపోవాలని కోరుకోవడం ఏమిటని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని కోరడంపై ఇప్పటికే మండిపడుతున్న కార్యకర్తలకు తాజా వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా తయారైంది.
ఆడబిడ్డను వెన్నుపోటు పొడిచారు
‘కోమటిరెడ్డిని నేను సొంత అన్నగా భావించాను. ఆడబిడ్డనని కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచారు. నా టికెట్ కోసం వెంకట్‌రెడ్డి సహకరించారు. అయితే ఆ సహకారం వెనుక ఇంత కుట్ర దాగుందని కలలో కూడా ఊహించలేదు. ఆడబిడ్డగా నేను మునుగోడులో ఒంటరిపోరాటం చేస్తున్నాను. వెంకటరెడ్డి అన్న మీరే నాకు ధైర్యం. ప్రచారానికి రావాలని వేడుకున్నా.. వెంకట్‌రెడ్డి ఇలా చేస్తారని అనుకోలేదు. ఆయన వ్యహారం నన్ను తీవ్రంగా కలచివేస్తున్నది. నాకు ఆర్థిక బలం లేకపోవచ్చు కానీ ప్రజా బలం ఉన్నది. మునుగోడు గడ్డపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే’
– కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపాటు