కంటోన్మెంట్/బొల్లారం, జూన్ 4 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్నారాయణ్ తన సమీప బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. గత శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నికలో మూడో స్థానంలో నిలిచింది.
కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్‌కు 53,651 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి వంశీ తిలక్‌కు 40,445 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు 34,462 ఓట్లు లభించాయి. ఎన్నికల కౌంటింగ్‌లో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి అధిపత్యాన్ని ప్రదర్శించి, విజయకేతనం ఎగురవేసింది. నియోజకవర్గంలో మొత్తం 2,53,706 ఓట్లకుగాను 1,30,929 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కంటోన్మెంట్లో 2009 తరువాత కాంగ్రెస్ జెండా ఎగరడం ఇదే ప్రథమం.కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేసిన అనంతరం.. ఎన్నికల అధికారి నుంచి శ్రీగణేశ్ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు భారీ విజయాన్ని కట్టబెట్టిన కంటోన్మెంట్ ఓటర్లందరికీ శతకోటి వందనాలు తెలిపారు.
పార్టీ మారి.. విజయం సాధించి..
2018 సార్వత్రిక ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగిన శ్రీగణేశ్ ఆ సమయంలో పార్టీ అధిష్ఠానం టికెట్ నిరాకరించడంతో చివరి నిమిషంలో బీజేపీలోకి చేరి కమలం గుర్తుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2019లో బీఆర్ఎస్లో చేరారు. సాయన్న మరణానంతరం 2023 సార్వత్రిక ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్య నందితకు టికెట్ ఇవ్వడంతో శ్రీగణేశ్ మళ్లీ బీజేపీలో చేరి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2024 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు
కాంగ్రెస్ : 53,651
బీజేపీ : 40,445
బీఆర్ఎస్ : 34,462