హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఒకటోసారి.. రెండోసారి.. మూడో సారి.. చీటీలు పాడే సమయంలో వింటుంటారు ఈ మాటలు.. రుణ మాఫీపై కాంగ్రెస్ నాయకుల మాటలు చూస్తే ఇవే గుర్తుకు వస్తున్నాయి. 2014 నుంచి రుణ మాఫీపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ ఇవే మాటలు చెప్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ తన ఎన్నికల హామీల్లో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించింది. వరంగల్ ఎన్నికల సభలో తొలిసారిగా ఆయన ఈ హామీ ఇచ్చారు.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. 2018 ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లోనూ ప్రజలు తిరస్కరించారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా వరంగల్‌లో రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని ముచ్చటగా మూడోసారి రాహుల్‌గాంధీ ప్రకటించటం విశేషం. కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ ప్రకటన చేసిన ప్రతిసారీ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ మాత్రం రూ.లక్ష రుణమాఫీ మాత్రమే సాధ్యమని, ఆ మేరకే తాము మాఫీ చేస్తామని హామీ ఇస్తూ వచ్చారు. దీంతో ప్రజలు టీఆర్ఎస్ను గెలిపించారు.