ములుగు: జిల్లాలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి ( Y. Satish Reddy ) అన్నారు. రైతులను రాజు ( King ) ను చేస్తామని బీరాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ బికారి( Beggers ) ని చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్కు రైతుల ఇబ్బందులను తీర్చాలని కోరుతూ శుక్రవారం వినతిపత్రం అందించారు.
అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ తరుగు పేరుతో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. వడ్ల కొనుగోలు జరిగే సమయంలో రైతుల పరిస్థితి మూలికే నక్కపై తాటికాయ పడిన చందంగా మారిందని అన్నారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని సరిగా అందించకున్నా రైతులు అప్పులు చేసి మరి పంటలపై పెట్టుబడులు పెట్టారని అన్నారు.
అకాల వర్షాల కారణంగా , పంట సరిగా పండక రైతులు అప్పుల ఊబిలోకి పోయారని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాల్సి ఉండగా వారిని గాలికి వదిలేసిందని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో 15 కిలోల వరకు కటింగ్లు పెడుతున్నారని, ఈ వ్యవహారంలో సగం మంత్రికి వెళ్తున్నాయని ఆరోపించారు.
మొక్కజొన్న పండించిన రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని అన్నారు. రైతుల కష్టాలను పట్టించుకొని, పరిష్కరించాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏసీ కథలకు పరిమితమయ్యారని ఆరోపించారు. నిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు విధులను మరచి వ్యవధిస్తున్నారని మండిపడ్డారు. నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.