హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ అమలుపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ తీసుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు పాతరేసినట్టు స్పష్టమైందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆదరాబాదరగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిందని, ఏడాదిగా ఊరిస్తూ వచ్చినా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు స్పష్టత లేదని తేలిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయలేమని సర్కార్ చేతులెత్తేసిందని తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సరారు ఇప్పటివరకూ పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేసిందని విమర్శించారు. అసెంబ్లీకి సమర్పించిన డాటా విషయంలో సరారుకే స్పష్టత లేకుండా పోయిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు ఉద్దేశం అధికార పార్టీకి లేనేలేదని అందరికీ అర్థమైందని తెలిపారు. కేంద్రంపైకి నెపం నెట్టి తప్పించుకోవాలన్నది కాంగ్రెస్ పన్నాగమని ప్రజలకు తెలిసిపోయిందని ధ్వజమెత్తారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలు, చెప్పిన గ్యారెంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్‌గాంధీ తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.