జయశంకర్ భూపాలపల్లి. మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎక్కడ చూసినా నాడు కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధే కనిపిస్తున్నది. ఆ తర్వాత అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎక్కడ అభివృద్ధి పనులు చేపట్టకపోగా, ఆనాడు మంజూరైన పనులను తన ఖాతాలోకి వేసుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నది. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సుమారు రూ.10 కోట్లతో మినీ స్టేడియం, ఆడిటోరియం, జిల్లా గ్రంథాలయం నిర్మాణానికి ఆనాటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ శిలాఫలకం వేశారు. పనులు ప్రారంభించే నాటికి ప్రభుత్వం మారడంతో బీఆర్ఎస్ శిలాఫలకాలకు కాంగ్రెస్ రంగు పూస్తున్నది. వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్‌కాలనీ సమీపంలో వారాంతపు సంత వద్ద మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మినీ స్టేడియం, ఆడిటోరియంతోపాటు గ్రంథాలయ భవన నిర్మాణానికి నాడు నిధులు మంజూరు చేయించారు.
మినీ స్టేడియం, ఆడిటోరియం నిర్మా ణానికి టీయూఎఫ్ ఐడీసీ ఫేజ్-4, ఫేజ్-2 కింద రూ.8.50 కోట్లు, జిల్లా గ్రంథాలయ భవనానికి రూ.కోటి మంజూరు చేశారు. ఈ నిధులతో వారాంతపు సంత స్థలం వద్ద మాజీ మంత్రి కేటీఆర్ 2023 ఫిబ్రవరి 23న శిలాఫలకంతో పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఈ నిధులతోనే కొత్త శిలాఫలకాలు వేస్తూ పనులు ప్రారంభించడమే కాకుండా కేటీఆర్ వేసిన శిలాఫలకాన్ని కూల్చేసేందుకు విశ్వప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు ముంజంపల్లి మురళి, మాడ హరీశ్‌రెడ్డి, పూసల యుగేంద్రాచారి, నల్లబెల్లి సదానందం, సాన సుధాకర్, శ్రీరాం, మనో హర్, దిలీప్, కుమార్ తదితరులు జేసీబీకి అడ్డుగా నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.