హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నోరు తెరిస్తే సామాజిక న్యాయమంటూ మాట్లాడుతారు. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. సామాజిక న్యాయానికి సమాధి కడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు రాష్ట్రంలో 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2 ఎమ్మెల్యే టికెట్లను ఇస్తామని నమ్మబలికింది. కానీ ఎన్నికల ముందు టికెట్ల కేటాయింపు సందర్భంగా వాగ్దానాన్ని అటకెక్కించింది. కేవలం బీసీలకు 26 టికెట్లను మాత్రమే కట్టబెట్టింది. అందులోనూ 5స్థానాలు హైదరాబాద్ పాతబస్తీ పరిధిలోకి వచ్చేవే. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన వెయ్యి రోజుల పాలనలో అడుగడుగునా మోసం చేస్తూనే ఉన్నది. మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి. మంత్రి పదవుల్లో తొలుత కేవలం కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌కు మాత్రమే అవకాశం కల్పించింది. ఆ తరువాత వాకిటి శ్రీహరిని తీసుకున్నారు. తాజాగా సురేఖను బర్తరఫ్ చేయడంతో మళ్లీ ఇద్దరే మిగిలారు. వారికిచ్చిన శాఖలు సైతం నామమాత్రమేననే విమర్శలున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల కేటాయింపుల్లోనూ సామాజిక న్యాయం అనే మౌలిక సూత్రాన్ని దెబ్బతీసింది. బీసీలకు మొండిచెయ్యి చూపింది. గత వెయ్యిరోజుల పాలనలో తెలంగాణ ప్రభుత్వం సుమారు 70కి పైగా కార్పొరేషన్లు, బోర్డులకు చైర్మన్లను నియమించింది. వాటిలో సామాజిక సమతుల్యత లోపించింది. సుమారు 31కార్పొరేషన్లు రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. కమ్మలకు 4, బ్రాహ్మణులకు 3, వెలమలకు 2, ముస్లింలకు7, ఎస్సీలకు 7, ఎస్టీలకు 4, బీసీలకు12 మాత్రమే ఇచ్చింది. ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్ల కేటాయింపుల్లోనూ కాంగ్రెస్‌ది అదే వైఖరి. ఇటీవల రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీలకు, మరొకటి ఎస్సీ లేదా ఎస్టీలకు కేటాయించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం బేఖాతరు చేసింది. ఒకటి అభిషేక్ సింఘ్కు, మరొకటి వేం నరేందర్‌రెడ్డికి అంటగట్టింది. ఎమ్మెల్సీ స్థానాల్లోనూ అదే పరిస్థితి. రాజకీయ పదవులే కాకుండా ముఖ్యమైన శాఖల్లోని పోస్టులైన అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో తదితర పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యతనిచ్చిన దాఖలాలు లేవు. తాజాగా క్యాబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ ఉదంతంతో బీసీ సంఘాలు రగిలిపోతున్నాయి.
బీసీ మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయడం దారుణమని, ఇంత నిరంకుశంగా వ్యవహరించడం కాంగ్రెస్ చేసిన అతిపెద్ద తప్పిదమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తక్షణమే సురేఖ బర్తరఫ్‌ను ఉపసంహరించుకోవాలని, లేదంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీసీలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, కాంగ్రెస్ అధిష్టానం బీసీలను గౌరవించే సంప్రదాన్ని కొనసాగించాలని, లేకుంటే భవిష్యత్తులో కాంగ్రెస్ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సురేఖ విషయంలో ప్రభుత్వం పునరాలోచించకుంటే ఆందోళనకు దిగుతామని తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : బడుగు, బలహీనవర్గాల ప్రతినిధి కొండా మురళి సతీమణి సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడాన్ని మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ పుటం పురోషోత్తం పటేల్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని దుయ్యబట్టారు.

ప్రభుత్వాన్ని బహిరంగంగానే తిడుతున్న ఇతర ఎమ్మెల్యేలు, నేతలపై చర్యలు తీసుకోకుండా.. బీసీ మంత్రినే బర్తరఫ్ చేయడం బీసీల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీల నాయకత్వ ప్రాబల్యాన్ని తగ్గించి, అగ్రకులాల ఆధిపత్యానికి తెర లేపుతున్నట్టుగా స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని, లేకుంటే మున్నూరుకాపులు, పద్మశాలీలు సహా సమస్త బీసీలు ఏకమై ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని పురుషోత్తం పటేల్ హెచ్చరించారు.