Revanth Reddy | హైదరాబాద్, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు మహారాష్ట్ర ఎన్నికల్లో పని చేయలేదు. రేవంత్‌రెడ్డి ప్రత్యక్షంగా 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తే.. ఒక్క సీటులోనే కాంగ్రెస్ గెలిచింది. పరోక్షంగా మరో 10 సీట్లలో ప్రచారం చేశారు. అక్కడా పార్టీ అభ్యర్థులకు ఓటమి తప్పలేదు. రాజురా, దిగ్రాస్, వార్దా, నయాగాన్, బోకర్, నాందేడ్ నార్త్, నాందేడ్ సౌత్, సోలాపూర్ సిటీ సెంటర్, సిటీ నార్త్, సిటీ సౌత్, నాగ్‌పూర్, పుణె, పాలూస్ కడెంగాన్, చంద్రాపూర్ నియోజకవర్గాల్లో రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. వీటిలో ఒక్క పాలూస్ కడెంగాన్లో కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ గెలుపొందారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా వ్యవహరించిన మాణిక్‌రావ్ ఠాక్రే దిగ్రాస్ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. ఆయన కోసం రేవంత్ ప్రచారం చేసినా ఓటమిని ఆపలేకపోయారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మూడుసార్లు మహారాష్ట్ర వెళ్లి వారంరోజులు అక్కడే మకాం వేశారు. ముంబై, పుణె, సోలాపూర్‌లో మీడియా సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించారు. పలుచోట్ల భారీ బహిరంగసభల్లో పాల్గొన్నారు. అన్నిచోట్ల తెలంగాణలో కాంగ్రెస్ పాలన గొప్పతనం ఇది అంటూ మరాఠా ప్రజలకు చెప్పుకొచ్చారు. ఆరు గ్యారంటీల అమలు తీరుపై గొప్పగా చెప్పారు. కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే మహారాష్ట్ర అభివృద్ధి బాధ్యత తనదేనంటూ భరోసా ఇచ్చారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, రూ.3 లక్షల రుణమాఫీ చేస్తామంటూ హామీలను గుప్పించారు. ఇవన్నీ చెప్పినా మహారాష్ట్ర ప్రజలు రేవంత్ మాటలను విశ్వసించలేదు. ఆయన గారడి బుట్టలో పడలేదు. తెలంగాణలో ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకున్న మహారాష్ట్ర ప్రజలు రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధాలను నమ్మలేదు.