పెద్దపల్లి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ) : పేదింటి బిడ్డలకు పెళ్లి సమయంలో ఆసరాగా నిలిచేలా.. పెళ్లి పెద్దగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ పాలనలో అభాసుపాలవుతున్నది. పెళ్లిలో మేనమామ ఏ విధంగా కానుకలను అందిస్తాడో.. అలానే కేసీఆర్ సర్కారు పచ్చని పందింట్లోనే చెక్కులను అందజేసింది. నేడు కాంగ్రెస్ పాలనలో మాత్రం పళ్లైన ఏడాది తర్వాత బిడ్డలను ఎత్తుకొని వచ్చి కల్యాణలక్ష్మి చెక్కులను తీసుకునే దుస్థితి కనిపిస్తున్నది. తులం బంగారం ముచ్చటే లేకపోగా.. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్ అందుకోవాల్సిన సమయంలో కల్యాణలక్ష్మి అందుకోవడం సర్కారు నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.
ఇందుకు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ‘కల్యాణలక్ష్మి, షాదీముబారక్’ చెక్కుల పంపిణీ నిదర్శనంగా నిలుస్తున్నది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గత ఏడాదిన్నర నుంచి పంపిణీ చేయకుండా ఉన్న లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ మంగళవారం చేపట్టారు. నియోజకవర్గంలోని 490 మంది లబ్ధిదారులకు రూ.4కోట్ల 90లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి పలువురు లబ్ధిదారులు పిల్లలను ఎత్తుకొని వచ్చి చెక్కులు తీసుకున్నారు. బీఆర్ఎస్ పాలనలో పెళ్లి రోజు పచ్చని పందిట్లో ఇచ్చిన కల్యాణలక్ష్మి చెక్కులను కాంగ్రెస్ పాలనలో పళ్లైన ఏడాది, రెండేళ్లకు పిల్లలను ఎత్తుకొని వచ్చిన తల్లులకు పంపిణీ చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. పెళ్లి రోజు ఇవ్వాల్సిన కల్యాణలక్ష్మి చెక్కులు ఏడాది, రెండేళ్లకు ఇస్తే.. ఇక బిడ్డ పుట్టిన తర్వాత అందించాల్సిన కేసీఆర్ కిట్‌ను అసలుకే ఇవ్వడం లేదు.
కల్యాణలక్ష్మి చెక్కును అందుకోవడానికి బిడ్డను ఎత్తుకొని తల్లి వస్తే.. ఆ బిడ్డను ఎత్తుకొని మరీ ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ చెక్కును పంపిణీ చేయడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ కల్యాణలక్ష్మి కానుకతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పినా.. ఆ ఊసే ఎత్తడంలేదు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పథకాల ఎంత జాప్యం అవుతున్నాయో.. కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత తెలుపుతున్నది.