Jana Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ కే జానారెడ్డి ఏఐసీసీ పెద్దలు మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు మంగళవారం లేఖ రాశారు. జానారెడ్డి ఎవరికైనా మద్దతునిస్తూ లేఖ రాశారా? అన్నది తెలియరాలేదు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఆరు ఖాళీలుండగా, ఉన్నవారిలో ఇద్దరిని తొలగించి మొత్తం ఆరుగురు కొత్తవారికి క్యాబినెట్లో స్థానం కల్పిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ విస్తరణతో మంత్రివర్గంలో అన్ని సామాజికవర్గాలకు చోటు కల్పిస్తారని సమాచారం.
ఇప్పటికైతే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డి పేర్లు ఖరారైనట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే జానారెడ్డి ప్రత్యేకంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ లేఖ రాయడం పార్టీ వర్గాల్లో కొత్త చర్చకు దారితీసింది. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే తన భార్యకు కూడా ఇవ్వాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పట్టుబడుతున్నారు. ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఒత్తిడి పెంచుతున్నారు.
ఈ నేపథ్యంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అవకాశం కల్పిస్తే రాజగోపాల్‌రెడ్డికి అవకాశం దక్కకుండా పోతుందని, తద్వారా అటు ఉత్తమ్‌కు, ఇటు రాజగోపాల్‌రెడ్డికి చెక్ పెట్టవచ్చనే ఉద్దేశంతోనే జానారెడ్డి లేఖ రాసి ఉంటారనే ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి నుంచి రామ్మోహన్‌రెడ్డి, తాండూరు నుంచి మనోహర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి ప్రస్తుతం మంత్రి పదవి కోసం పోటీపడుతున్నారు.
బీఆర్ఎస్ నుంచి గెలుపొంది కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్టు తెలిసింది. జానారెడ్డి రాసిన లేఖలో ఎవరికీ ప్రత్యేకంగా మద్దతు ప్రకటించనప్పటికీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదనే విమర్శలు వ్యక్తమవుతాయనే సాకుతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రిపదవి దక్కకుండా చేయడంలో భాగంగానే లేఖ రాసినట్టు ప్రచారం జరుగుతున్నది. మంత్రివర్గ విస్తరణకు గురువారం ముహూర్తం ఖరారైనట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు చోటు కల్పించాలని ఏఐసీసీ పెద్దలను ఆ జిల్లా నేతలు కోరారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు వేర్వేరుగా వారు మంగళవారం ఢిల్లీలో లేఖలు అందజేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా నుంచి ఆరుగురికి అవకాశం కల్పించిందని లేఖలో గుర్తుచేశారు. లేఖలపై సంతకాలు చేసినవారిలో స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్, ఇబ్రహీంపట్నం, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎం రామ్‌రెడ్డి ఉన్నారు.