హైదరాబాద్ : ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. ప్రభుత్వం అందించే ఎంతో కొంత సాయంతో సొంతిల్లు కట్టుకోవాలనుకుంటున్న సామాన్యుడి కలలు కల్లలవుతున్నాయి. గూడు కోసం ఆశలు తీరకముందే ప్రాణాలు పోయే పరిస్థితులు దాపురించాయి. ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా కాంగ్రెస్ పాలన తయారైంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అలవి గానీ హామీలతో (Congress schemes)ప్రజలను మభ్యపెట్టింది. తీరా గెలిచాక ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నది. అరకొర పథకాలను ప్రవేశపెట్టినా సవాలక్ష కొర్రీలతో అంతంత మాత్రంగా అమలు చేస్తున్నది.
రక్తసిక్తమవుతున్న గ్రామ సభలు
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన ఆ పార్టీ చివరికి రూ.12 వేలతో సరిపెట్టి నమ్మిన రైతులను నట్టేట ముంచింది. ఇదొక్కటనే కాకుండా ఏ ఎక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు నాలుగు ప్రభుత్వ పథకాలను అమలు చేసేందుకు చేపట్టిన గ్రామ సభలు(Grama sabhalu) రక్తసిక్తమవుతూ యుద్ధక్షేత్రాలను తలపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు(Indiramma housess, రేషన్ కార్డులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అనర్హులకు కేటాయిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గ్రామ సభల నుంచి తరిమి తరిమికొడుతున్నారు.
టెంట్లు కూల్చేసి, కుర్చీలు విరగొట్టి తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు. తమకు నచ్చిన వాళ్లకే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు కేటాయిస్తాం. తాగి పైసలు తీసుకొని ఓటేసిన మీకు ఇవ్వమని గ్రామ సభల్లోనే కాంగ్రెస్ నేతలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. అనర్హులకు పథకాలను కట్టబెడుతుంటే ఇదేంటని ప్రశ్నించిన ప్రజలపై కాంగ్రెస్ గుండాలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన కొంతమంది అర్హులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు.
ఆత్మహత్యాయత్నాలు..
తాజాగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెంలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు అనే రైతు గ్రామసభ వద్ద పురుగుల మందు తాగాడు. మరోవైపు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజవర్గం పెద్దకొత్తపల్లిలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకొని కూడా మాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ రేగులపాడు నరసింహ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర గందరగోళం, నిరసనల మధ్య భారీ పోలీసుల బందోబస్తు నడుమ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గతంలో ఏనాడు కూడా ఇలాంటి నిర్బంధాల మధ్య లబ్ధిదారులను ఎంపిక చేయలేదని ప్రజలు వాపోతున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి జనం ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఘోరీ కడుతామని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.