KTR | హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లా ఉన్నది. సీరియల్ కిల్లర్స్లాగా కాంగ్రెస్ పాలకులు సీరియల్ ల్యాండ్ స్నాచర్స్‌గా మారారు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాలు, త్యాగాల ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడటాన్ని సహించబోమని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నందినగర్‌లో ఉన్న తన నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (మనూ) విద్యార్థులతో కేటీఆర్ శుక్రవారం సమావేశమయ్యారు. 50 ఎకరాల వర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకోవడంపై విద్యార్థులు కేటీఆర్‌తో చర్చించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఉర్దూ యూనివర్సిటీ భూములను కాపాడుకొనే విషయంలో విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
అవసరమైతే విద్యార్థులతోపాటు ఢిల్లీలో ధర్నాకు దిగుతామని, పార్లమెంట్‌లోనూ ఇదే అంశంపై చర్చిస్తామని భరోసా ఇచ్చారు. హైకోర్టు పేరుతో గతంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాల భూమిని తీసుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. హెచ్‌సీయూలో కూడా 400 ఎకరాల భూమిని గుంజుకొనే ప్రయత్నం చేయగా, విద్యార్థుల ఆందోళనతోపాటు సుప్రీంకోర్టు జోక్యంతో అది తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని అమ్ముకొనేందుకు కుట్ర పన్నిందని విమర్శించారు. ఇండియన్ సూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) యాజమాన్యానికీ నోటీస్ ఇచ్చారని, వారి నుంచి కూడా 100 ఎకరాలు లాకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. హెచ్‌సీయూ భూమి లాక్కోవడంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం దాగి ఉన్నదని నిర్ధారణ అయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదని తెలిపారు. హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చర్య తీసుకొని ఉంటే ఇవాళ ఉర్దూ వర్సిటీ భూముల కబ్జాపర్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒడిగట్టేది కాదని స్పష్టంచేశారు.
దేశంలో మైనారిటీల సంరక్షకుడిని అని చెప్పుకొనే రాహుల్‌గాంధీ ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమే వారిని కాపాడటమా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న మైనారిటీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడమే మీ సంరక్షణా? మొహబ్బత్‌కీ దుకాణ్ అని చెప్తున్నది ఇదేనా? వర్సిటీ భూములను గుంజుకొని విద్యార్థులను రోడ్డుపై వేయడమేనా? రాహుల్‌గాంధీ దీనికి సమాధానం చెప్పు?’ అని నిలదీశారు. తెలంగాణలో తొలిదశ ఉద్యమం వల్లే హైదరాబాద్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమాలు, త్యాగాల ఆధారంగా ఏర్పడిన ఈ యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడటాన్ని సహించబోమని హెచ్చరించారు.

చేతగాని రాహుల్‌గాంధీ.. హైదరాబాద్‌లో అశోక్‌నగర్‌కు వచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట ఎందుకు ఇచ్చావు? అని కేటీఆర్ ప్రశ్నించారు. రెండేండ్లు గడిచినా ఇంతవరకు 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని, రెండు లక్షల ఉద్యోగాలు ఏమైందని పిల్లలు రోడ్డెక్కితే వాళ్లను గొడ్లను బాదినట్టు బాది పోలీస్స్టేషన్లలో నిర్బంధించారని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీసేస్తే.. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పారు. రాహుల్‌గాంధీ విద్యార్థులతో మాటాముచ్చట పెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేసింది నిజం కాదా? రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశంపై స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయించాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
మళ్లీ రెండున్నరేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి నిధులిచ్చి అభివృద్ధి చేస్తాం. మనూ వర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఉంటాం. ఢిల్లీలో పోరాటం చేయడానికి కూడా మీతో కలిసివస్తం. రాజ్యసభలో మను వర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయొద్దని కొట్లాడుతం.
-కేటీఆర్
నిరుద్యోగులు, యువతకు తమ పార్టీ అండగా ఉంటుందని, తమ విద్యార్థి విభాగం వారికి భరోసా ఇస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో బట్టల దుకాణం, సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి రేవంత్‌రెడ్డి వెళ్తున్నారని, విద్యార్థులను అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లు తిప్పారని మండిపడ్డారు. రెండురోజులుగా ఆరేడు పోలీస్స్టేషన్లు తిప్పి విద్యార్థులు, నిరుద్యోగ యువకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకోబోమని మను వర్సిటీ విద్యార్థులు హెచ్చరించారు. యూనివర్సిటీల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తే సహించమని స్పష్టంచేశారు.
మళ్లీ రెండున్నరేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం తిరిగి వస్తుందని, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. మను వర్సిటీ విద్యార్థులకు మద్దతుగా ఉంటామని, ఢిల్లీలో పోరాటం చేయడానికి కూడా మీతో కలిసి వస్తామని, రాజ్యసభలో మాట్లాడుతామని చెప్పారు. ‘గతంలో నిజాం కాలేజీలో హాస్టల్ లేదంటే ప్రభుత్వ నిధులతో మేము హాస్టల్ కట్టించాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీకి అండగా ఉంటాం. కావాల్సిన విస్తరణ సౌకర్యాలకు నిధులు కూడా కేటాయిస్తాం. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు మా పార్టీ తరఫున అండగా ఉంటాం. రాబోయే మా ప్రభుత్వంలో యూనివర్సిటీ విస్తరణ కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తాం. విద్యార్థుల వెంట ఉంటామని వారి పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నా. యూనివర్సిటీ భూములపైన కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేయడం ఏమాత్రం మంచిది కాదు’ అని రేవంత్ సర్కార్‌కు కేటీఆర్ హితవు పలికారు.
హైదరాబాద్‌కు తలమానికంగా దేశంలోనే ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యంజేసే కుట్రకు దిగింది. విశిష్టమైన ఈ యూనివర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తున్నది. 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా గుంజుకునేందుకు యత్నిస్తున్నది. తెలంగాణ ఉద్యమాలు, త్యాగాల ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీల భూములను రియల్ ఎస్టేట్ కోసం వాడటాన్ని సహించబోము.
బెదిరింపులకు దిగుతున్నరు
మను వర్సిటీ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం చేస్తున్నారని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారు. రాత్రివేళల్లో ఫోన్లు చేసి ఉద్యమం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఉద్యమం చేస్తున్నాం. ఎంపీలకు లేఖలు రాస్తాం. ఢిల్లీలో ఆందోళన చేస్తాం. మను వర్సిటీపై 2 వారాల్లోగా వివరణ ఇవ్వాలి. దేశంలో ఉన్న ఒకే ఒక్క ఉర్దూ యూనివర్సిటీ భూములనూ అమ్మకానికి పెడితే మేమెలా చదువుకోవాలి. రేవంత్ కుట్రలతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యక్తిత్వాన్ని వదిలి ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహరించాలి.
‘వర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ, వర్సిటీలో నిరుపయోగంగా భూములు ఎన్ని ఉన్నాయి. వాటిని ఎలా స్వాధీనం చేసుకొని అమ్ముకోవాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నది. దీనిపై కేంద్ర సర్కార్ పట్టించుకోవడం లేదు. మేము చదువుకోవడానికి ఇక్కడికొచ్చాం. కానీ, మా వర్సిటీ భూములను రక్షించుకోవడానికి పోరుబాట పట్టాల్సి వస్తున్నది. వసతులు కల్పించకుండా భూములు అమ్ముతామంటే ఎలా?
రాహుల్‌గాంధీ విద్య గురించి, యూనివర్సిటీల గురించి మాట్లాడుతారు. కానీ, ఆయన పార్టీకి చెందిన ముఖ్యమంత్రియే మను వర్సిటీ భూములు అమ్మాలని చూస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు. వర్సిటీ భూముల జోలికి వెళ్లొద్దని ఎందుకు చెప్పడం లేదు. మను వర్సిటీ భూములపై కేటీఆర్ ట్వీట్ చేయడంతో ఇది నేషనల్ ఇష్యూగా మారింది. కేసీఆర్ స్పందించకపోతే మీడియా కవరేజ్ కూడా ఉండేది కాదు. మాకు అండగా నిలిచిన కేటీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. వర్సిటీ భూములను రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుస్తున్నారు.