ఖైరతాబాద్, డిసెంబర్ 4 : రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో భూ ఆక్రమణలతో పాటు రౌడీయిజం పెరిగిందని, ఇప్పుడు ఆ పార్టీ పెద్దల పేరుతో భూ దందాలకు తెగబడుతున్నారంటూ పలువురు బాధితులు ఆరోపించారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో బాధితులు, బాధిత రైతులతో కలిసి మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి అక్రమాల పుట్టను వెలుగులోకి తెచ్చారు. ఈ సందర్భంగా లోకహిత సంస్థ గౌరవ అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం బొంరాసిపేటలో రంజిత్‌రెడ్డి ఇష్టానుసారం భూ దందాలు చేస్తూ అమాయక ప్రజలు, పేద రైతులను దోచుకుతింటున్నాడని తెలిపారు.
వ్యవసాయదారులు తమ భూముల్లోకి వెళ్లకుండా అడ్డుగా గోడ కట్టి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నాడని ఆవేదనతో చెప్పారు. పోలీసులు, రెవెన్యూ, కలెక్టర్ స్థాయి అధికారులు కూడా పట్టించుకోవడం లేదని, ప్రజల విజ్ఞప్తులను బుట్టదాఖలు చేస్తున్నారని ఆరోపించారు.
రంజిత్ రెడ్డి, ఆయన కుమారుడు ఆర్యన్‌రెడ్డి తమకు ఎంపీ కేసీ వేణుగోపాల్ కుమారుడు, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్‌తో వ్యాపార లావాదేవీలున్నాయని, పలు వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నందున ఏం చేయలేరంటూ బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తంచేశారు. తమ గోడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినందుకు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తమపై ఒత్తిడి తెస్తున్నాడని, ఏమైనా ఉంటే వారితో మాట్లాడుకోవాలని సలహా ఇస్తున్నారని వాపోయారు.
రంజిత్‌రెడ్డి అతడి గ్యాంగ్ ప్రత్యక్షంగా అధికార పార్టీ అండదండలతో రైతులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పాలన ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పేదల హక్కులను కాలరాసి, వారి భూములు కొల్లగొట్టే పాలన సాగుతున్నదంటూ నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి రంజిత్‌రెడ్డి, అతని అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. తమకు న్యాయం జరుగని పక్షంలో బాధితులతో కలిసి ముఖ్యమంత్రి ఇంటినే ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
రంజిత్‌రెడ్డి ఓ పెద్ద ఫ్రాడ్: రవికిరణ్‌రెడ్డి, రైతు నేత
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో అసలు, వడ్డీని సమయానికి చెల్లించకపోవడంతో బొంరాసిపేటలోని లియోనియా రిసార్ట్ భవనాలను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా బ్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారని రైతు నాయకుడు రవికిరణ్‌రెడ్డి తెలిపారు. దానికి రూ.2వేల కోట్ల బకాయిలు ఉంటే కొన్నేండ్లు బ్యాంకర్లే నడిపించారని, ఇటీవల వాటిని వేలంలో ఎంపీ రంజిత్‌రెడ్డి సింగిల్ టెండర్‌తో రూ. 237 కోట్లకు దక్కించుకున్నాడని పేర్కొన్నారు. పాత బకాయిలు కలిపి సుమారు రూ.2,500 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. రూ.2వేల కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.237 కోట్లకు అది కూడా సింగిల్ టెండర్లో ఎలా అప్పగిస్తారని, ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
ఈ వేలంలో పది భవనాలను సొంతం చేసుకున్న రంజిత్‌రెడ్డి భూ దాహంతో చుట్టుపక్కల ఉన్న రైతుల భూములపై పడి కబా చేసి దౌర్జన్యం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతేగాక వాటిని బినామీల పేరిట మార్చి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ ఏడాది రంజిత్‌రెడ్డికి సంబంధించిన డీఎస్ఆర్ గ్రూప్‌పై కర్ణాటక, ఏపీ, తెలంగాణ, హైదరాబాద్‌లోని తదితర ప్రాంతాల్లో 30 బృందాలు ఐటీ దాడులు చేసి అక్రమాల గుట్టును బయటపెట్టాయని వివరించారు. నానక్‌రాంగూడ వద్ద 14 ఎకరాల 14 గుంటల్లో రంజిత్‌రెడ్డి చేపట్టిన నిర్మాణాల్లో ఒక్కొక్కటి రూ.12కోట్ల నుంచి రూ.13కోట్లకు అమ్ముతున్నాడని, వాటి నిర్మాణ పన్నులు సైతం ఎగవేశాడని ఆరోపించారు. కేవలం బొంరాసిపేటలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా రంజిత్‌రెడ్డి బాధితులు ఉన్నారని చెప్పారు.
నీళ్లకు గోసపడుతుంటే..
బొంరాసిపేట చుట్టుపక్కల ఉన్న జీహెచ్ఎంసీలోని 15 గ్రామాల్లో తాగునీరు రావడం లేదని, కానీ మూడు కిలోమీటర్ల దూరం నుంచి తన రిసార్ట్‌కు మాత్రం 18 ఇంచుల పైపులను రాత్రికి రాత్రే వేయించాడని, జలమండలి నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా వందలాది లీటర్ల నీటిని తరలించుకున్నాడని వివరించారు. ఓ వైపు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే ఆయన స్విమ్మింగ్ పూల్ కోసం నీళ్లు తరలించుకుపోతున్నాడని విమర్శించారు. రైతుల భూములను కబ్జా చేసి ప్రశ్నించిన వారిని చంపుతానని బెదిరిస్తున్నాడని చెప్పారు. అర్ధరాత్రి రైతుల భూముల్లో చెట్లు నరికి తరలించుకుపోతూ, పచ్చని అడవిని నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు.
కబ్జా చేసిన వాటిలో కొన్నింటిని బినామీలకు కట్టబెడుతున్నాడని, తన వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నాడని చెప్పుకొంటున్నాడని తెలిపారు. బొంరాసిపేటలో ఇప్పటివరకు పది వేల కోట్ల విలువైన భూ దోపిడీ చేశాడని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి బ్యాంకులు రూ.100 కోట్ల రుణం ఇచ్చినట్టు తెలిసిందని, కానీ ఓ పేద రైతు పోయి బ్యాంకును లక్ష రూపాయల అప్పు అడిగితే తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రాడ్ రంజిత్‌రెడ్డి బినామీలు సైతం ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సిట్ ఏర్పాటు చేయడంతో పాటు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రవికిరణ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఎన్సీఎల్టీకి నకిలీ దస్తావేజులు సమర్పించిన ఘనుడు: కపిల్‌కుమార్ శర్మ, అచూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ కార్యదర్శి
‘2008లో అచూట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ పేరిట ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేశాం. వాటిని అభివృద్ధి చేసి అందు లో భవనాలు, ఎస్టీపీ నిర్మించాం. 2009లో కొంతభాగాన్ని లియోనియో రిసార్ట్‌కు లీజ్‌పై ఇచ్చి, అకామిడేషన్, ఎస్టీపీ కోసం అగ్రిమెంట్లు చేసుకున్నాం. సెప్టెంబర్ 2024లో లీజ్ ముగిసినా భవనం ఖాళీ చేయడం లేదు, డబ్బులు కట్టడం లేదు. కాంట్రాక్ట్ క్యాన్సల్ చేసుకోకపోవడంతో మార్చి 1న ఖాళీ చేయమని అడిగేందుకు వెళ్లే నాపైనే అక్రమ కేసులు పెట్టించాడు. తిరిగి నేనే దౌర్జన్యం చేశానంటూ పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేశాడు. మాకు సుమారు రూ.7కోట్ల బకాయిలు చెల్లించాలి. పోలీసులకు ఒరిజినల్ డాక్యుమెంట్లు చూపిద్దామని స్టేషన్‌కు వెళ్తే అది తీసుకెళ్లే సమయానికే తనపై అక్రమ కేసులుంటాయని బెదిరించారు.
ఇక నాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది’ అని కపిల్కుమార్శర్మ ఆవేదన వ్యక్తంచేశారు. తన వద్ద అని సాక్ష్యాలు ఉన్నాయని చెప్పినా వినకుండా తనను లాకప్‌లో వేశారని వాపోయారు. లియోనియా రిసార్ట్ వద్ద సీసీ టీవీ కెమెరాలను పెడితే రంజిత్‌రెడ్డి మనుషులు వచ్చి వాటిని ధ్వంసం చేశారని, పోలీసులకు ఫిర్యాదుచేసినా ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆ స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు నకిలీ లీజు దస్తావేజులను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) కోర్టు లో సమర్పించి మరో అక్రమానికి తెరలేపాడని, ఈ విషయం వెలుగుచూసిన తర్వాత ఆయనపై కేసులు సైతం నమోదయ్యాయని పేర్కొన్నారు.
ఆ నకిలీ దస్తావేజును మార్చి 25న కొనుగోలు చేస్తే ఒకటో తేదీన అగ్రిమెంట్ జరిగినట్టు పత్రాల్లో రాయించాడని, ఇంతకంటే సాక్ష్యం ఏముంటుందని ఆయన సూటిగా ప్రశ్నించారు. వాటిని కూడా పోలీసులకు అప్పగించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రంజిత్‌రెడ్డి, అతడి గ్యాంగ్‌పై పెట్టిన కేసులను పట్టించుకోని పోలీసులు తనపై పెట్టిన అక్రమ కేసులకు మాత్రం చార్జిషీట్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నియో లియోనియా రిసార్ట్‌కు వచ్చిన రంజిత్‌రెడ్డి డబ్బుతో ఏ అధికారినైనా కొంటానని, ప్రభుత్వమే తన చేతుల్లో ఉన్నదని, తనను ఎవరూ ఏం చేయలేరంటూ బీరాలు పలుకుతున్నాడని చెప్పారు. అయితే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఆయన స్పష్టం చేశారు.
చెట్లు నరికారు.. అడిగితే తుపాకీతో బెదిరించారు
లియోనియా చుట్టూ సర్వే నంబర్ 414, 430లో మాకు పట్టా భూమి కొంత ఉన్నది. మొన్న ఎలాంటి సమాచారం లేకుండా ఆర్ఐ, సర్వేయర్లు వచ్చి లెక్కలు వేస్తున్నారని తెలిసి అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా, బలవంతంగా చెట్టు కొట్టివేయించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఒక్కరూ కూడా అక్కడికి రాలేదు. చుట్టుపక్కల ఉన్న రైతుల భూముల్లోకి వెళ్లకుండా అడ్డుగోడ కట్టారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో తుపాకులను చూపిస్తూ బెదిరిస్తున్నారు.
– కృష్ణారెడ్డి, బాధిత రైతు