హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో అక్రమాలకు, తాయిలాలకు చెక్‌పెట్టేందుకు ప్రవేశపెట్టిన ‘సీ-విజిల్’ యాప్‌ను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దుర్వినియోగం చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో బీఆర్ఎస్ నేతలపై ఉత్తుత్తి ఫిర్యాదులు చేస్తూ ఎన్నికల సంఘం విధులకు ఆటంకం కగిలిస్తున్నారు. ‘ఇదిగో పులి అంటే అదిగో తోక’ అన్న చందంగా సోషల్ మీడియాలో గాలి వార్తలను వండివార్చి ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్స్కు ఇబ్బంది కలిగిస్తున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయెల్ నివాసంలో కాంగ్రెస్ జరిపించిన ఐటీ సోదాలే ఇందుకు తాజా నిదర్శనం. గోయెల్ ఇంట్లో కోట్ల రూపాయల డబ్బు, భారీగా మద్యం ఉన్నదన్న ఫిర్యాదులో నిజం లేదని సోదాల్లో తేలడంతో కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ సోదాలకు ముందు మంత్రి సబిత, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, మర్రి జనార్దన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి వారి బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన దర్యాప్తు సంస్థల అధికారులు.. దేశంలో ఒక్క బీజేపీ నేత ఇంటిలోనూ సోదాలు జరిపిన దాఖలాలే లేవు.