హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం సచివాలయంలో కలిసి విన్నవించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, కోదండరెడ్డితో కలిసి మంత్రి తుమ్మల రైతు సంఘం నేతలతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు కన్నెగంటి రవి, పశ్య పద్మ, కిరణ్, పాకాల శ్రీహరిరావు కౌలు రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
సాగర్, కిరణ్ భూ యజమాన్య హకులు, వాటి చట్టాలను సవరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. అన్వేష్‌రెడ్డి, నల్లమల వెంకటేశ్వరరావు జీలుగ, పత్తి విత్తనాల లభ్యత గురించి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి తుమ్మల, చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రైతు శ్రేయస్సుకు అవసరమయ్యే పథకాలపై క్యాబినెట్ లో చర్చించి అమలు చేస్తామని తెలిపారు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి రైతుభరోసా, రుణమాఫీ, పంటల బీమాపై రైతు సంఘాలతో చర్చించారు.