MP Mallu Ravi | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎంపీ మల్లు రవికి అవమానం ఎదురైంది. సీపీఎం నేత సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరైన మల్లు రవి వేదికపై రెండో లైన్లో కూర్చున్నారు. మొదటి వరుసలో సీపీఎం జాతీయ నేతలు, సభాధ్యక్షుడు, ముఖ్య అతిథి సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు.
సభకు ముందుగానే వచ్చిన మల్లు రవి సీఎం రేవంత్‌రెడ్డి కోసం ఏర్పాటుచేసిన కుర్చీకి సరిగ్గా వెనుక వరుస సీటులో కూర్చున్నారు. ఇంతలో సీఎం రేవంత్ సభా వేదిక వద్దకు వచ్చారు. ఆయనకన్నా ముందుగా వేదికనెక్కిన సెక్యూరిటీ సిబ్బంది వెనుకసీటులో కూర్చున్న మల్లు రవిని లేవాలని ఆదేశించారు. తానెందుకు లేవాలి అని మల్లు రవి నిలదీసినప్పటికీ బలవంతంగా ఆయనను అక్కడి లేపి మరింత వెనుకకు పంపించారు. దీంతో దళిత ఎంపీకి జరిగిన అవమానంపై దళితవర్గాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి దళిత ప్రజాప్రతినిధులను అవమానిస్తూనే ఉన్నదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏచూరి సంస్మరణ సభలో దళిత ఎంపీ మల్లు రవిని సీఎం రేవంత్‌రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా లేపి అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఒక సిట్టింగ్ దళిత ఎంపీ అయిన మల్లు రవి సీఎం వెనకాల రెండో వరుసలో కూడా కూర్చోడానికి అర్హుడు కాదా? అని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియోను శనివారం ఎక్స్‌లో పోస్టుచేసి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.