ఖమ్మం, సెఫ్టెంబర్ 28 : కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలు ఆచరణకు సాధ్యమయ్యే హామీలు కావని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు స్థలంలో గురువారం ఖమ్మం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఇక్కడ గ్యారెంట్ స్కీంలు అని బీరాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్కే, అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి హ్యాట్రిక్ నమోదు చేస్తారని స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. తెలంగాణలో పండినంత ధాన్యం రాష్ట్రంలో మరే ఇతర రాష్ట్రంలోనూ పండడం లేదన్నారు.
రాష్ట్రం ఇప్పుడు దేశానికే అన్నం పెడుతున్నదన్నారు. కొవిడ్ సమయంలో రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేశామన్నారు. రెమిడెసివర్ ఇంజెక్షన్లు కొరత ఉన్న సమయంలో తాను హెటిరో డ్రగ్స్ అధినేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డితో మాట్లాడి ఇంజెక్షన్స్ తెప్పించామని గుర్తుచేశారు.
ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో లేకపోతో ‘ఇండియన్ టొబాకో కార్పొరేషన్’ ప్రతినిధులతో మాట్లాడి సిలిండర్స్ తీసుకొచ్చామన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వందల మంది కొవిడ్ బాధితులను కాపాడుకున్నామన్నారు. అప్పుడు ఏ ప్రతిపక్ష పార్టీ నాయకుడూ ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రాలేదన్నారు. ఇప్పుడు వారంతా వీధుల్లోకి వచ్చి లేనిపోని హామీలు ఇస్తున్నారన్నారు.
వారి మాటలు ప్రజలు నమ్మొద్దన్నారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి తాను ఒళ్లు దాచుకోకుండా పనిచేస్తున్నానని, మరోసారి ప్రజలను ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళా క్షేత్రంలో 223 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఖమ్మం వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.