KCR | ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన అశేష జనవాహిణిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ నాటి కాంగ్రెస్, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్పా.. ఏనాడు నోరెతెరిచి కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్ఎస్ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్ నాయకులు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి.. ఎంత ఘోరమంటే.. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే మన శాసనసభలో తెలంగాణ పదాన్నే నిషేధించాడు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించాడు. ఇదే జిల్లాకు చెందిన ప్రయణ్ భాస్కర్ ఆ రోజు ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే.. అది నేరమైనట్లుగా పరిగణించి తెలంగాణ పదాన్నే నిషేధించే ప్రయత్నించారు. మీ అందరికీ చరిత్ర తెలుసు’నన్నారు.
‘ఆనాడైనా, ఏనాడైనా.. ఈనాడైనా తెలంగాణకు విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు.. ప్రజలు వద్దంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వారే కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ. 1969లో తెలంగాణ ఉద్యమం వస్తే.. 400 మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లా కాల్చి చంపింది ఇందిరా గాంధీ ప్రభుత్వం. ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన. 2001 నుంచి విజృంభిస్తే.. నంగనాచిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి.. మన బలాన్ని, మన ఊపును చూసి పొత్తుపెట్టుకొని తెలంగాణ ఇస్తమని నమ్మబలికి మీరు చూశారు. మళ్లీ ఎగొట్టే ప్రయత్నం చేశారు. 14 సంవత్సరాలు ఏడిపించారు. అది మీ అందరికీ తెలుసు. వాళ్లు ఎట్లెట్ల చేస్తుంటే.. వారి మోసాన్ని కప్పేయడానికి నేను.. జయశంకర్ సార్‌తో కలిసి పార్లమెంట్లో ప్రతిపక్షాలు కాంగ్రెస్ గొంతుపట్టుకుంటే.. అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు. మళ్లీ ప్రకటన వెనక్కి తీసుకొని.. మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత సకల జనుల సమ్మె కావొచ్చు. సాగర హారాలు కావొచ్చు. వంటావార్పులు కావొచ్చు.. అనేక రూపాల్లో విజృంభించి భీకరమైన పోరాటం చేశాం’ అంటూ గుర్తు చేశారు.
‘మూడేళ్ల తర్వాత రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు మళ్లీ తెలంగాణ ఇస్తామని ప్రకటించారు. వారికి ఇష్టం లేకపోయిన తెలంగాణ సృష్టించిన సుడిగాడుపులు తట్టుకలేమని తెలంగాణ ఇచ్చిన విషయం మీకు తెలుసు. తదనంతరం. ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. మనం అధికారం అనుభవించేందుకు తీసుకోలేదు. బాధ్యతగా తీసుకున్నాం. రాష్ట్రాన్ని మన చేతులో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడికి తీసుకొని పోయాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది. ఎన్ని రంగాల్లో ఎన్ని అవార్డులు వచ్చాయి. ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపించాం. తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. ఎగతాళి చేబడ్డ ప్రాంతం. పలికిమాలిన ప్రాంతం అని పేరుపెట్టబడిన ప్రాంతం. కానీ, ఎన్నిరంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచాం. రూ.90వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.3.50లక్షలకు పెంచుకున్నాం. జీఎస్డీపీని దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాం. తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకున్నాం’ అని వెల్లడించారు.