Congress | హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల్లో తమను అపహాస్యం చేసిందనే అభిప్రాయం బీసీ వర్గం నేతల్లో వ్యక్తమవుతున్నది. ఆదివారం ప్రకటించిన తొలి జాబితాలో బీసీలకు 12 సీట్లు కేటాయించిన కాంగ్రెస్.. ఓడిపోయే సీట్లనే అంటగట్టిందనే విమర్శలు వస్తున్నాయి. వీటిలో కాంగ్రెస్‌కు చెప్పుకోదగ్గ బలం లేని జీహీచ్ఎంసీలోనే ఏడుసీట్లు ఉండగా, పాతబస్తీలోనే నాలుగు సీట్లు కేటాయించడంపై బీసీ వర్గాలు విస్తుపోతున్నాయి.
చాంద్రాయణగుట్టలో బోయ నగేశ్, యాకుత్‌పురలో కే రవిరాజు, బహదూర్‌పురలో పులిపాటి రాజేశ్‌కుమార్, గోషామహల్లో మొగిలి సునీతకు సీట్లు కేటాయించింది. మిగిలిన జిల్లాల్లోనూ దాదాపుగా ఓడిపోయే సీట్లనే బీసీలకు కేటాయించింది. ఎంఐఎం బలంగా ఉన్న పాతబస్తీ సీట్లు, బీఆర్ఎస్ బలంగా ఉన్న సీట్లను బీసీలకు కేటాయించడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆ వర్గం నేతలు మండిపడుతున్నారు.