మహబూబ్‌నగర్, (నమస్తే తెలంగాణ ప్రతినిధి), జనవరి 19 : అధికారులపై అధికార పార్టీ నాయకుల (Congress leaders) ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనిచేయాలని లేకపోతే సస్పెండ్ చేయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పలువురు అధికారులు పనిచేయలేక సతమతమవుతున్నారు. తాజాగా పెంట్లవెల్లి మండల దళిత తహసీల్దార్‌పై(Dalitha Tahsildar) అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయాలని ఒత్తిడి చేయడంతో ఆమె నిరాకరించారు.
దీంతో అధికార మదంతో మహిళ, దళిత తహసీల్దార్అని చూడకుండా పేపర్లను తహసీల్దార్ మొఖంపై విసిరేసి నిన్ను సస్పెండ్ చేయించిన తర్వాతే కార్యాలయంలోకి అడుగుపెడతామని కాంగ్రెస్ నాయకులు బెదిరించినట్లు తెలిసింది. శుక్రవారం కల్యాణలక్ష్మి కార్యక్రమంలో ప్రజాప్రతినిధికి తప్పుడు సమాచారం ఇచ్చి సస్పెండ్ చేస్తామని పబ్లిక్‌లో బెదిరింపులకు దిగారు. అధికార పార్టీ నాయకులు కార్యాలయాల్లో తిష్టవేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులు చేయాలని ఒత్తిడి చేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో అధికారులు ఉన్నారు.
అధికారపార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలి
అధికార పార్టీ నాయకులు దళిత మహిళ తహసీల్దార్‌ను బెదరించడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం మండలకేంద్రంలో మాలమహానాడు రాష్ట్ర నాయకులు పీవీ రావు, గోవురాజు విలేకరులతో మాట్లాడుతూ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వారికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని దళిత తహసీల్దార్‌ను బెదరించడం సరైనది కాదన్నారు. రెవెన్యూ చట్టాలకు విరుద్ధంగా పనిచేయనని చెప్పిన దళిత తహసీల్దార్ మొఖంపై పేపర్లు విసిరి వివక్షత చూపిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని లేదంటే ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు వెంకటేశ్, వెంకటయ్య, ప్రకాశ్, వెంకటస్వామి ఉన్నారు.