Congress leaders Resignations | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ క్రమంగా పుంజుకుంటున్నది. అధికార బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతోపాటు తొలి విడుత ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నది. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నేతలు.. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు విభేదాలతో వీధిన పడుతున్నారు. మంగళవారం రాష్ట్ర పర్యటనకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండగా.. పెద్దపల్లి, గద్వాల్ జిల్లాల్లో షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పెద్దపల్లిలో సీనియర్ కాంగ్రెస్ నేతలు సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి తదితరులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. గద్వాల-జోగులాంబ జిల్లా కేంద్ర కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. గద్వాల్ డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు.
పెద్దపల్లి కాంగ్రెస్ నేతలు సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి తదితరులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన సొంత జేబు సంస్థగా మార్చుకున్నాడని, పర్సనల్ ఏజెండాతో వచ్చి పార్టీని ఆగం చేస్తున్నడని ఆరోపించారు. తనకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటున్నదని అన్నారు. రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ రాహుల్ గాంధీ చదువతడని, ఆయన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
మరోవైపు, అసిఫాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నేత శ్యామ్ నాయక్.. తానే అభ్యర్థినంటూ చేసుకుంటున్న ప్రచారం తీరుపై స్థానికులు నిరసన తెలుపుతున్నారు. రెండు రోజుల క్రితం గుండె గ్రామ ప్రజలు నిరసన తెలపడంతో శ్యామ్ నాయక్.. తన భుజాలపై ఉన్న కాంగ్రెస్ పార్టీ కండువా తీసేసి, సాధారణ వ్యక్తుల పక్కన నిలుచుండి పోయాడని చెబుతున్నారు. తాజాగా మంగళవారం జైనూర్ మండలం దబోలి గ్రామంలో ప్రచారానికి వెళ్లిన శ్యామ్ నాయక్‌ను స్థానికులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి పోయారు.