హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బనకచర్లకు అనుకూలంగా మసలుతుండటంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిందా? ఇది లోలోపల రగులుతూ అంతర్యుద్ధం స్థాయికి చేరిందా? మంత్రివర్గంలోని అసలు కాంగ్రెస్ నేతలు, వలస కాంగ్రెస్ నేతలు చెరోవైపు చీలిపోయారా? ముఖ్యనేత హైకమాండ్ ఆదేశాలుకు అనుగుణంగా కాకుండా పైకమాండ్ సూచనల మేరకు పనిచేస్తున్నారా? ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుతో కాంగ్రెస్‌కు ఇసుమంతైనా లబ్ధి లేకపోగా, క్షేత్రస్థాయిలో ఊహించనంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నదని అసలు కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. జూన్ చివరి వారంలో జరిగిన క్యాబినెట్ భేటీలో రేవంత్‌రెడ్డి ఉరుకులాటను ముగ్గురు సీనియర్ మంత్రులు తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆగస్టు మొదటి వారంలో నలుగురు అసలు కాంగ్రెస్ మంత్రులు కూడబలుక్కున్నట్టు ఒకే రోజు వేర్వేరు మీడియా హౌస్‌లకు వెళ్లి బనకచర్లను కట్టనిచ్చేది లేదని ధిక్కరించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
పుట్టి ముంచడం ఖాయం
గత నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూల వైఖరితో సంతకాలు చేయడంపై అసలు కాంగ్రెస్ నేతలు క్రమక్రమంగా ధిక్కార స్వరం పెంచుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆంధ్రకు, కేంద్రానికి మాత్రమే లబ్ధి చేకూర్చే బనకచర్ల ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చుతున్నదని, అయినా రేవంత్‌రెడ్డి దూకుడుగా వెళ్లడంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆత్మరక్షణలో పడ్డట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రెండు పడవల మీద కాలేసిన నడుస్తున్న సీఎం, పుట్టి ముంచి ఎప్పుడో ఒకప్పుడు జంప్ అవుతాడని అసలు కాంగ్రెస్ నేతలు ఆందోళనతో ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు మంత్రాంగంతో ఆయన మోదీ మాయలో పడ్డారని బహిరంగంగానే చెప్తున్నారు. అయినా వెళ్తే వెళ్లిండు కానీ పార్టీని నిట్టనిలువునా బనకచర్లలో ముంచి వెళ్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ఆంతర్మథనంలో పడ్డట్టు తెలిసింది. ఇప్పుడిప్పుడే తమకు రాజకీయ ఆశలు చిగురిస్తున్నాయని రాబోయే ఎన్నికల్లోనైనా దేశానికి రాహుల్ ప్రధాని అవుతాడనే ఆశతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భారీ శరాఘాతం తగిలే పరిస్థితులే కనిపిస్తున్నాయని అసలు కాంగ్రెస్ నేతలు ఆందోళనతో ఉన్నట్టు తెలిసింది. అదే అంశాన్ని పలువురు మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్‌కు చెప్పినట్టు చర్చ జరుగుతున్నది.
పోలవరంపై పోరుతో కౌంటర్ చేస్తాం
ఢిల్లీ పర్యటన తర్వాత జూన్ చివరి వారంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముగ్గురు సీనియర్ మంత్రులు సీఎంను గట్టిగానే ప్రశ్నించిన విషయం తెలిసిందే. గత ఆదివారం మరో నలుగురు సీనియర్ మంత్రులు కూడబలుక్కున్నట్టు ఒకే రోజు వేర్వేరు మీడియా చానల్ హౌస్‌లకు వెళ్లి మాట్లాడారు. బనకచర్లకు అనుమతులు ఎలా తెచ్చుకోవాలో తమకు తెలుసని, కాళేశ్వరానికి పొక్కగొట్టి తీసుకపోవటం లేదని గత నెల 31 ఏపీ మంత్రి, నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీనియర్ మంత్రులు నలుగురు మీడియా ముందుకు వచ్చారు. కొల్లాపూర్ సభలో కూడా ఇద్దరు సీనియర్ మంత్రులు బనకచర్ల మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటో తేల్చి చెప్పారు. లోకేశ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజలను తప్పుతోవ పట్టించే వ్యాఖ్యలు చేయొద్దని, తెలంగాణకు అన్యాయం చేసే బనకచర్లను కట్టనిచ్చే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి తరువాత అంతటి నేత ప్రకటించారు.
కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి కాబట్టి లోకేశ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మరో కీలక నేత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రజాస్వామ్య దేశమని, పొత్తులు ఉన్నాయని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరని లోకేశ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వందకు వంద శాతం బనకచర్ల అక్రమ ప్రాజెక్టు అని ఆయన తేల్చి చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల్లో నికర, మిగులు, వరద జలాల వాటా తేలకముందే బనకచర్ల ప్రాజెక్టును నిర్మించడానికి తాము అంగీకరించబోమని ఇంకో సీనియర్ నేత స్పష్టం చేశారు. నలుగురు సీనియర్లు వేర్వేరు చానళ్లలో, వేర్వేరు సభల్లో మాట్లాడినప్పటికీ ఉమ్మడి స్వరంతో ‘రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలే తమకు ముఖ్యమని’ ప్రకటించారు. బనకచర్ల కోసం ఏపీ పట్టుబడితే తాము పోలవరంపై పోరుతో కౌంటర్ ఇస్తామనే సంకేతం ఇచ్చారు. వారి వ్యాఖ్యలు బనకచర్ల మీద రేవంత్ నిర్ణయాలకు, చర్యలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఏఐసీసీ ఆదేశాల మేరకే సీనియర్ నేతలు మాట్లాడినట్టు చర్చ జరుగుతున్నది. కానీ ఇప్పటి వరకు లోకేశ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో సహా వలస కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఎవరూ కూడా స్పందించక పోవడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది.