Telangana | అన్నిరకాల ప్రలోభాలూ పనిచేయక, ప్రజాక్షేత్రంలో భంగపాటును ఎదుర్కొన్న కాంగ్రెస్.. అసహనంతో రగిలిపోతున్నది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కుతంత్రాలకు తెరలేపింది. దొడ్డిదారిన మున్సిపాలిటీల హస్తగతం కోసం దాదాగిరీకి దిగింది.ప్రజాతీర్పును అపహాస్యం చేస్తూ.. కిడ్నాప్‌లు, దాడులకు పాల్పడింది. జనగామలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీసుకు వెళ్లకుండా.. కాంగ్రెస్ నాయకులతో కలిసి పోలీసులు అడ్డుకున్నారు. పూర్తి కోరం ఉన్నప్పటికీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయించారు. తొర్రూరు, క్యాతనపల్లిలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి పోలీసులు, అధికారులు దగ్గరుండి సహకరించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్ పార్టీ గూండాగిరీ పరాకాష్టకు చేరింది. పోలింగ్ ప్రక్రియలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డ అధికార పార్టీ దొడ్డిదారిన మున్సిపాలిటీలను హస్తగతం చేసుకొనేందుకు అడ్డదారులు తొక్కింది. పోలీసుల దన్ను, అధికారుల అండదండలతో అరాచకపర్వానికి తెరలేపింది. చివరి అంకంలోనూ యథేచ్ఛగా ప్రలోభాలపర్వం కొనసాగించింది. ప్రతిపక్ష కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేసింది. తాయిలాల ఆశచూపి లొంగదీసుకొనే కుట్రలు, కుతంత్రాలకు దిగింది. పురపాలికల్లో ‘పై చెయ్యి’ సాధించేందుకు ఇష్టారాజ్యంగా వ్యవహరించి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. నోట్ల కట్టలు ఆశచూపి వికటాట్టహాసం చేసింది.
పట్టణాల నడిబొడ్డున కాంగ్రెస్ నేతలు సాగించిన దుర్మార్గపు వ్యవహారం భీతిగొల్పింది. ఒకటి, రెండు స్థానాలు కూడా దక్కనిచోట్ల ఖాకీల ప్రోద్బలంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు ఇండిపెండెంట్, ఇతర అభ్యర్థులపై దాడులకు దిగింది. అభ్యర్థులు క్యాంపుల నుంచి ఎన్నికల కేంద్రాలకు చేరుకోకముందే బస్సుల నుంచే అపహరించేందుకు యత్నించి రాజ్యాంగ విలువలు, నైతిక సూత్రాలకు తిలోదకాలిచ్చింది. సిద్ధాంతాలను గాలికొదిలి, రాజకీయ వైరుధ్యాన్ని పక్కనబెట్టి హంగ్ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీని దక్కించుకొనేందుకు అధికార కాంగ్రెస్ దమనకాండకు దిగింది. ఇక్కడ 16 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల గెలిచాయి. బీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ సాధించింది. అయితే ఎక్స్అఫీషియో ఓట్ల పేరిట కాంగ్రెస్ డ్రామాకు తెరలేపింది. జనగామ మున్సిపాలిటీలోనూ అధికార కాంగ్రెస్ దుర్మార్గాలకు తెగబడింది.
పోలీసుల అండతో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కనుసన్నల్లో వక్రమార్గంలో కైవసం చేసుకొనేందుకు విఫలయత్నం చేసింది. జనగామలో 30 వార్డులకు గాను బీఆర్ఎస్ 13 చోట్ల గెలిచింది..కాంగ్రెస్ 12 చోట్ల, మిత్రపక్షమైన సీపీఎం ఒకచోట, నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిచిన 13తోపాటు ఇద్దరు ఇండిపెండెంట్లు మద్దతు ఇవ్వడం, ఎక్స్అఫీషియోగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓటు హక్కు ఉండటంతో బీఆర్ఎస్ బలం 16కు చేరింది. కాంగ్రెస్‌కు ఇద్దరు ఇండిపెండెంట్లు, సీపీఎం మద్దతు ఇవ్వడం, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్స్అఫీషియో ఓటుతో ఆ పార్టీ బలం సైతం 16కు చేరింది.
అయితే, బీఆర్ఎస్కు చెందిన 28వ వార్డు కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను ఎమ్మెల్యే కిడ్నాప్ చేశారంటూ కేసు నమోదైనందున ఆమెకు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో పాల్గొనే అర్హతలేదని ఎంపీ చామల అడ్డుకున్నారు. ఇందుకు డీఎస్పీ సైతం సహకరించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఫాతిమా సైతం తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, తమ పార్ట్టీ చైర్మన్‌కే ఓటేస్తానని తేల్చిచెప్పారు. అయితే, ఎన్నికల హాల్లోకి వెళ్తుండగా ఆమెను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బాహాటంగానే ప్రకటించారు. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం నిలువరించేందుకు యత్నించారు. ఎంపీ చామలతోపాటు పలువురు హాల్ బయట బైఠాయించారు. నిలువరించాల్సిన పోలీసులు చోద్యం చూశారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.