హైదరాబాద్, జనవరి31(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుకున్న దాని కంటే తక్కువ స్థానాల్లో గెలిచి అపకీర్తిని మూటగట్టుకున్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో పరువు నిలుపుకోవాలనే ఆలోచనతో ఉన్నది. రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకొని పట్టు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నది.
అయితే క్షేత్రస్థాయి సర్వేలు, నివేదికలు అందుకు అనుకూలంగా లేవు. దీంతో ఫోన్‌ట్యాపింగ్ కేసుకు ప్రాణం పోసి సిట్ విచారణల పేరిట డ్రామాకు తెరలేపారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామా సస్పెన్షన్ కొనసాగిస్తారని వారు అభిప్రాయ పడుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కనీసం 80 శాతం పంచాయతీలను గెలుస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వేలం పాటల ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపించినా.. ప్రజాక్షేత్రంలో మాత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక పిలుపు కూడా ఇవ్వకుండానే పల్లెల్లో గులాబీ దండు సత్తా చూపింది.
హోరాహోరాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. సీఎం జిల్లాల పర్యటనలు, మంత్రులు, ఎమ్మెల్యేల బెదిరింపులు, దాడులు, హత్యలు, అధికారం, డబ్బు అన్నింటినీ ఎదుర్కొని జనం గులాబీ జెండాను రెపరెపలాడించారు. గులాబీ సైన్యం పోటీచేసిన అన్ని ప్రతి పంచాయతీల్లో పోటీ నువ్వా- నేనా అన్న రీతిన సాగింది. సంఖ్యాపరంగా కాంగ్రెస్ పార్టీకి పంచాయతీల సంఖ్య కొద్దిగా మెరుగ్గా ఉన్నట్టు కనిపించినా.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుచుకున్నారు.
ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారాయి. క్షేత్రస్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితులు ఉండటంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొన్నది. ఎన్ని మాటలు చెప్పినా, ఇంకెన్ని హామీలు గుప్పించినా ప్రజలు నమ్మి కాంగ్రెస్‌కు ఓటేసే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మూసీ ఆక్రమణల కూల్చివేతలు, ఆసరా పింఛన్, ఎరువుల కొరత, మహిళలకు నెలకు రూ.2,500 హామీ తదితర పథకాలను అమలు చేయకపోవటంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలే అసంతృప్తితో రగిలిపోతున్నాయి.
తాజాగా నైని బొగ్గు గనుల టెండర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య ఆధిపత్య పోరు బయటపడిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో మరింత పలుచనైంది. మంత్రి కోమటిరెడ్డికి, ఓ ఐఏఎస్ అధికారికి మధ్య అనైతిక సంబంధాలపై కథనాలు వెల్లడి కావడంతో ఇంకింత పలుచబడ్డట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్, క్యాడర్ దృష్టిని మళ్లించేందుకే ఫోన్‌ట్యాపింగ్ కేసును మళ్లీ తెర మీదికి తెచ్చారనే ప్రచారం జరుగుతున్నది. అందుకే ఎన్నికల ప్రక్రియకు స్వల్ప గడువే ఇచ్చారని, ఫోన్‌ట్యాపింగ్ డ్రామా ముగిసిపోయేలోగా మున్సిపాలిటీ ఎన్నికలను ముగించాలని యోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందులో భాగంగానే ముందుగా కేటీఆర్‌కు, ఆ తర్వాత హరీశ్‌రావుకు, సంతోష్‌రావుకు నోటీసులు ఇవ్వడం ద్వారా క్యాడర్‌ను మానసికంగా అలర్ట్ చేశారని అంటున్నారు.
ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే నోటీసులు జారీ చేయించి, లీడర్, క్యాడర్ మూడ్‌ను సంపూర్ణంగా ఇదే ఇష్యూపై కేంద్రీకరించేలా వ్యూహరచన చేశారని చెప్తున్నారు. ఎన్నికలు ముగిసే వరకు రేవంత్‌రెడ్డి ప్రేరేపించిన పోలీసులు ఈ డ్రామాను రక్తి కట్టిస్తూనే ఉంటారని అంటున్నారు. కాగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్ని డైవర్షన్ డ్రామాలాడినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని ప్రజలు మరచిపోయే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌కు అంచనాలకు మించిన దెబ్బ తగులుతుందని వారు తేల్చి చెప్తున్నారు.