భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ మణుగూరు టౌన్, నవంబర్ 2 : భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీ గూండాగిరీ ప్రదర్శించింది. మణుగూరులోని బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ కార్యాలయంపై (BRS Party Office) కాంగ్రెస్ గూండాలు ఆదివారం దాడికి తెగబడ్డారు. అందులోని నలుగురు కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించి వారిని బయటకు ఈడ్చివేశారు. ఆపైన కార్యాలయంలోని కుర్చీలు, బల్లలు, ఇతర ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా వాటన్నింటినీ కార్యాలయం ఎదుట వేసి గులాంబీ జెండాలు, ఫ్లెక్సీలతో కప్పి పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అగ్నికీలలు ఎగసిపడటంతో ఇరుగుపొరుగు నివాసాల వారు భయాందోళనకు గురయ్యారు. అగ్నికీలలు ఎగిసి తమ ఇండ్లపైనా, దుకాణాలపైనా పడతాయేమోనని భయకంపితులయ్యారు. అయినా, ఆగని కాంగ్రెస్ మూకలు తమ దమనకాండను కొనసాగించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోను నేలకు విసిరికొట్టి విధ్వంసం సృష్టించాయి. స్వల్ప సంఖ్యలో అక్కడికి వచ్చిన పోలీసులు కాంగ్రెస్ గూండాగిరీని చూస్తూ మిన్నకుండిపోయారు. దీంతో మరింత రెచ్చిపోయిన కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ కార్యాలయానికి ఉన్న గులాబీ రంగు పెయింట్‌పై కాంగ్రెస్ రంగు పెయింట్లు వేశారు. ‘తెలంగాణ భవన్’ పేరు కూడా కనిపించకుండా పెయింట్ వేసి దానిపై ‘ఇందిరమ్మ కార్యాలయం’ అని ఉన్న ఫ్లెక్సీని కట్టారు. కార్యాలయం పైభాగంలో దిమ్మెకు ఉన్న బీఆర్ఎస్ జెండాను తొలగించి కాంగ్రెస్ జెండాను ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో స్థానికుల సమాచారంతో ఫైరింజన్ చేరుకొని మంటలను అదుపుచేసింది. తరువాత పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఉద్రిక్త పరిస్థితిని చల్లార్చారు.

బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసేందుకు కాంగ్రెస్ నేతలు కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నారు. మణుగూరులో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ నియోజకవర్గ కార్యాలయం తమదంటూ కొన్ని రోజులుగా కాంగ్రెస్ నాయకులు ప్ర చారం చేసుకుంటున్నారు. పత్రాలు చూపించి నిరూపించుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోషల్‌మీడియా ద్వారా సమాధానమిస్తున్నారు. ఈ క్రమంలో సమయం కోసం వేచి చూసిన కాంగ్రెస్ గూండాలు ఆదివారం పక్కా స్కెచ్‌తో రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, పార్టీ పినపాక నియోజకవర్గ నాయకులు కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో ఉంటున్నారు. దీనిని అదునుగా భావించిన కాంగ్రెస్ రౌడీమూకలు ఆదివారం ఉదయం పది గంటల సమయంలో మణుగూరులోని బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్నారు. షట్టర్లు పగలగొటి లోనికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. స్థానికంగా ఉండే నలుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు హుటాహుటిన అక్కడికి చేరుకొని అడ్డుకోబోయారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు విచక్షణ రహితంగా పిడిగుద్దులు కురిపించారు. తీవ్రంగా గాయపడిన వారిని బయటకు గెంటివేశారు. కాంగ్రెస్ గూండాగిరీ ప్రదర్శించి బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆక్రమించడం, ఫర్నిచర్‌కు నిప్పుపెట్టడంతో పట్టణ ప్రజలు, స్థానికులు పెద్ద సంఖ్చలో అక్కడికి చేరుకున్నారు. వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి విధ్వంసం సృష్టిస్తుండటంతో మణుగూరు సబ్ డివిజన్ పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. 144 సెక్షన్ విధించారు. మధ్యాహ్నం తరువాత పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

మణుగూరులోని బీఆర్ఎస్ కార్యాలయం పై కాంగ్రెస్ దాడిని ఖండిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ ధర్నాలు, రా స్తారోకోలు చేసి కాంగ్రెస్ దౌర్జన్యాన్ని ఖండించారు. అయితే, బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను ఏమీ అనని పోలీసులు, కాంగ్రెస్ రౌడీయిజాన్ని ప్రశ్నిస్తూ నిరసనకు దిగిన బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.

బీఆర్ఎస్ మణుగూరు కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీమూకల దాడి పట్ల బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, స్థానిక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం మణుగూరుకు చేరుకున్న ఆయన కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద మీడియాతో మాట్లాడారు. భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. తామెవరమూ లేని సమయంలో తమ పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటని, అది పిరికిపందల చర్యని విమర్శించారు. ఫ్లెక్సీలు కట్టినంత మాత్రాన ఏమీ అయిపోదని, న్యాయం ఎవరిదనేది కాలమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ కార్యాలయ ఫర్నిచర్‌ను తగులబెడుతున్నా, తమ కార్యకర్తలపై దాడి చేస్తున్నా పోలీసులు ఏమీ స్పందించకుండా చూస్తూ ఉండిపోవడం దారుణమని అన్నారు. తమ కార్యాలయంపైనా, తమ కార్యకర్తలపైనా దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను ఏమీ అనకుండా, అరెస్టు చేయకుండా తమ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం ఏమటని ప్రశ్నించారు. కాంగ్రెస్ గూండాలు ఎంత రెచ్చిపోయినా, రెచ్చగొట్టినా ప్రభుత్వ వైఫల్యాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు ధైర్యముంటే రూ.100 కోట్ల డీఎంఎఫ్టీ నిధుల లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ దాడిని ఖండించారు. ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా మాజీ ఎమ్మె ల్యే హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, చంద్రావతి కూడా వేర్వేరు ప్రకటనల్లో కాంగ్రె స్ దాడులను ఖండించారు.