హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం జూరాల ప్రాజెక్టుకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రాజెక్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడంతో తొమ్మిదో నంబర్ గేట్ రోప్ తెగిపోయిందని గురువారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. ఒక్క ఇటుక కూడా పేర్చడంరాని ముఖ్యమంత్రి.. నిర్వహణ విషయంలోనూ విఫలం కావడంతో ప్రాజెక్టే ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏటా భారీగా వరద వస్తుందని తెలిసినా, స్పిల్‌వే వద్ద నిర్వహణ పనులు చేపట్టడంలో అలక్ష్యం చేశారని మండిపడ్డారు.
ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు మొద్దునీద్ర వీడి, కండ్లు తెరిచి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని డిమాండ్ చేశారు. ఎగువ నుంచి వచ్చే వరదను ఎప్పటికప్పుడు అంచనావేస్తూ పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే రేవంత్ సర్కారు అసమర్థతతో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి ఎనిమిది మంది మృతి చెందారని, పెద్దవాగుకు గండిపడి 16 గ్రామాలు ముంపునకు గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. వట్టెం పంప్‌హౌస్ మునిగిపోయి, సుంకిశాల కుప్పకూలి రూ.వందల కోట్ల ప్రజాధనానికి గండిపడ్డదని, ఇప్పుడు జూరాల నిర్వహణలోనూ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు.