 
                                                            ‘ఏసేస్తా.. వారం రోజుల్లో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా’ అంటూ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బెదిరింపులకు దిగి 24గంటలు గడవకముందే రౌడీమూక రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుల బృందంపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. వెంగళరావు నగర్‌లోని వికాస్పూర్లో ప్రచారం నిర్వహిస్తున్న నవీన్‌యాదవ్ సోదరుడు వెంకట్‌యాదవ్ 15 మందితో వచ్చి దాడికి దిగాడు. బీఆర్ఎస్ జెండాలు, కరపత్రాలు, ఓటర్ల లిస్టు లాక్కుని వెళ్లిపోవాలని బెదిరించాడు. దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. తీరు మారకపోతే ప్రజలే బుద్ధిచెప్తారని హెచ్చరించింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో (Jubilee Hills) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ (Naveen Yadav) కుటుంబ అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. గల్లీలు దాటనీయం, ఇండ్లలో ఉండనీయబోమంటూ నవీన్‌యాదవ్ హెచ్చరించిన కొద్ది గంటలకే ఆయన తమ్ముడు వెంకట్‌యాదవ్ కూడా బెదిరింపులకు దిగారు. వెంగళరావునగర్ పరిధిలోని వికాస్పూర్లో ప్రచారం చేస్తూ రోడ్డు పక్కన నిల్చున్న ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ తాతా మధు అనుచరులపై గూండాగిరీ చేశారు. ‘ఎవర్రా మీరు ఇక్కడ నిలబడ్డరు? ఎక్కడి నుంచో వచ్చిన …కొడుకులు ఇక్కడ ప్రచారం చేస్తార్రా? రేపటి నుంచి ఒక్కడు కూడా ఇక్కడ కనపడొద్దు. కనిపిస్తే చంపేస్తాం … కొడుకుల్లారా.బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తే ఒక్కొక్కడ్ని ఏసేస్తం’ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తమ్ముడు వెంకట్‌యాదవ్ ఊగిపోయారు.
ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దని బూతులతో విరుచుకుపడ్డారు. నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరాచకాలకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తున్నది. నవీన్‌యాదవ్ మీడియా ముఖంగా బెదిరింపులకు పాల్పడుతుండగా, ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడీలు మంచోళ్లు, పంచాయితీలు సెటిల్ చేస్తారంటూ ప్రకటనలు ఇస్తున్నారు. తాజాగా నవీన్‌యాదవ్ తమ్ముడు వెంకట్ ఏకంగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. కార్యకర్తల మెడల నుంచి కండువాలు గుంజుకుని జులుం ప్రదర్శించారు. ప్రచారం చేస్తే బతకనీయనంటూ బెదిరించారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలపై రౌడీయిజం ప్రదర్శించారు.

ఎమ్మెల్సీ తాతా మధు అనుచరులు ఎనిమిది మంది గురువారం రాత్రి వెంగళరావునగర్ పరిధిలోని వికాస్పూర్లో ప్రచారం చేస్తూ రోడ్డు పక్కన నిలబడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తమ్ముడు వెంకట్యాదవ్తోపాటు మరో 15 మంది గూండాలు బైకులపై అక్కడికి వచ్చారు. బీఆర్ఎస్ కండువాలు, ఓటర్ల లిస్టుతో రోడ్డు పక్కన నిలబడిన ఎనిమిది మందిని ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. ఖమ్మం నుంచి వచ్చామని వారు చెప్పడంతో బూతు పురాణం అందుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన … కొడుకులు ఇక్కడ ప్రచారం చేసుడేందిరా? ఇక్కడి నుంచి …. కొడుకుల్లారా అంటూ రాయలేనంత ఘోరంగా తిట్టారు. బైకులు దిగి వారిపై దాడికి తెగబడ్డారు. వారి మెడల్లోంచి కండువాలను గుంజుకున్నారు. చేతుల్లో ఉన్న ఓటర్ల లిస్టు సహా బీఆర్ఎస్ కరప్రతాలను లాక్కొని చించేశారు. అక్కడితో ఆగకుండా వారి ఫోన్లు లాక్కునేందుకు ప్రయత్నించగా అప్పటికే అక్కడి జనం గుమికూడటంతో వెనక్కి తగ్గారు. ఇంకోసారి జూబ్లీహిల్స్‌లో కనిపిస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎవడైనా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తే ఒక్కొక్క … కొడుకులను ఏసేస్తాం అని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. జూబ్లీహిల్స్‌లో కనిపిస్తే అక్కడే నరికేస్తాం …కొడుకుల్లారా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తాతా మధు, స్థానిక కార్పొరేటర్ దేదీప్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి, సీసీ టీవీ ఫుటేజీ ద్వారా దాడిపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. కార్పొరేటర్ దేదీప్య బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్, ఆయన తండ్రి, తమ్ముడు ప్రచారం కంటే ఓటర్లను బెదిరించడం, ఇతర పార్టీల కార్యకర్తలు, నేతలకు వార్నింగ్‌లు ఇస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వీరి వ్యవహారం రాజకీయ నాయకుల్లా కాకుండా రౌడీల ప్రచారం లాగా జరుగుతున్నది. బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తే గల్లీల్లో తిరగనీయబోమని, ఇండ్ల నుంచి బయటకు రానీయమంటూ నవీన్‌యాదవ్ ఇటీవల హెచ్చరించారు. ఒక్కొక్కరిని వారం రోజుల్లో కనబడకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థిలా కాకుండా పేరుమోసిన రౌడీలా వ్యవహరిస్తున్నారు. ఓట్లు వేయకుంటే ఎవరినీ వదిలిపెట్టమంటూ బెదిరింపులుకు దిగారు. ఇప్పటికే హత్యాయత్నం కేసులు, దాడి కేసులున్న నవీన్‌యాదవ్ తమ్ముడు ప్రవీణ్‌యాదవ్ అలియాస్ వెంకట్‌యాదవ్ రంగంలోకి దిగారు. తన వెంట బైకులపై 15 మంది గూండాలను తీసుకుని జూబ్లీహిల్స్ నియోజకవర్గ వీధుల్లో తిరుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎక్కడ కనిపించినా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే చంపేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తూ తమలోని రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు.
నవీన్‌యాదవ్ తమ్ముడు వెంకట్‌యాదవ్ అరాచకాలు కొనసాగుతున్నాయి. అడ్డొచ్చిన వాళ్లందరినీ ప్రచారం చేయొద్దని బెదిరిస్తున్నారు. ఎర్రగడ్డ పరిధిలోని సుల్తాన్‌నగర్‌లో ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నేత రవియాదవ్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. మనమిద్దరం ఒకే కులం, నువ్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎలా ప్రచారం చేస్తావని ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ పార్టీ నేతలపైనే బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తుంటే సామాన్యుల పరిస్థితేంటని జూబ్లీహిల్స్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ప్రచారం చేయొద్దనే స్థాయికి వారి రౌడీయిజం ఉండటంతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు.
ప్రచారం చేసేందుకు ఖమ్మం నుంచి వచ్చిన మా కార్యకర్తలను నవీన్‌యాదవ్ తమ్ముడు వెంకట్ యాదవ్ రౌడీల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులు, 16 మంది కార్పొరేషన్ చైర్మన్లు కూడా రాష్ట్రంలోని వేరే ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా. వారిని కూడా ఇక్కడి నుంచి వెళ్లగొట్టండి. నవీన్‌యాదవ్ కుటుంబం చేస్తున్న రౌడీయిజంపై పోలీసులు, ఎలక్షన్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రచారంలోనే దాడులకు పాల్పడుతున్నారు. ఎన్నికలో గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజలను హింసకు గురిచేస్తారు. నియోజకవర్గ ఓటర్లు నవీన్‌యాదవ్ కుటుంబం అరాచకాలు రూపుమాపేందుకు మాగంటి సునీతగోపీనాథ్కు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి.
-దేదీప్యారావు, వెంగళరావునగర్ కార్పొరేటర్
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తమ్ముడు వెంకట్‌యాదవ్ మా అనుచరులపై దాడికి దిగారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి రౌడీయిజాన్ని చూపిస్తున్నారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఓడిపోతామని అర్థం కావడంతో మా నాయకులను, కార్యకర్తలతో పాటు జూబ్లీహిల్స్ ప్రజలను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, జూబ్లీహిల్స్ ప్రజలు రౌడీలు, గూండాలకు భయపడరు. కాంగ్రెస్ అభ్యర్థి గూండాగిరీని జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి నవీన్‌యాదవ్‌కు బుద్ధి చెప్తారు. మా కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోం. వారికి తగిన బుద్ధి చెప్తాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్నీ సహనంతో చూస్తున్నారు. మాగంటి సునీత గోపీనాథ్ గెలుపుతో జూబ్లీహిల్స్‌లో రౌడీయిజాన్ని రూపుమాపుతాం.
-తాతా మధు, ఎమ్మెల్సీ
 
                            