హైదరాబాద్, మే 16 (నమస్తేతెలంగాణ) : ‘పిల్లలు తెలియక తప్పులు చేసుడు సహ జం. అంతమాత్రానికే తండ్రి కేంద్ర మంత్రి పదవికి రాజీనా మా చేయాలనడం ఎంతవరకు సమంజసం?’ అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రశ్నించారు. మంగళవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ వివాదంపై స్పందించారు. ఈ విషయంలో బండి సంజయ్ తండ్రిగా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించారని వెనుకేసుకొచ్చారు. తన కొడుకు తప్పు చేశాడని తెలిసినప్పుడు దాచే ప్రయత్నం చేయకుండా, చట్టానికి లొంగిపోయేలా చేశాడని, చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో వ్యవహరించిన సంజయ్ వైఖరిని అభినందించాలని చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఒకదానిపై ఒకటి ఎప్పుడూ నిప్పులు కురిపించుకుంటాయి. ఒక పార్టీకి సంబంధించి ఏ చిన్న వైఫల్యం దొరికినా మరోపార్టీ చీల్చిచెండాడుతుంది. కానీ రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. బీజేపీకి చెందిన కేంద్రమంత్రి వివాదంలో చిక్కుకున్నా కాం గ్రెస్ ఎంపీ వెనుకేసుకు రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది.