హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ప్రభుత్వం కొత్తగా నిర్మించే ఫోర్త్‌సిటీకి తరలించనున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయని, ఇదే జరుగుతుందేమోనని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ప్రభుత్వ ఉద్దేశాన్ని బయటపెట్టారు. ఈ మేరకు శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం వివాదాస్పదమైన 400 ఎకరాల భూమితోపాటు యూనివర్సిటీ ఉన్న 1,500 ఎకరాల్లో ఎకోపార్క్ నిర్మిస్తామని తెలిపారు. హెచ్‌సీయూ భూ విషయంపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిపై రాహుల్‌గాంధీకి కోపం తెప్పించేలా పలువురు వ్యవహరిస్తున్నారని, అలా చేయడంతో రాహుల్‌గాంధీ ఇక్కడి ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయాలని చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫ్యూచర్ సిటీకి తరలిస్తే ఉద్యమం ; మీనాక్షికి ఎన్ఎస్యూఐ స్పష్టీకరణ
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూములను వర్సిటీకి వదిలేయటం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయ మార్గమే లేదని ఎన్ఎస్యూఐ నేతలు మీనాక్షి నటరాజన్‌కు తేల్చి చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. యూనివర్సిటీ భూములపై వాస్తవ పరిస్థితిని ఏఐసీసీకి నివేదించడానికి మీనాక్షి నటరాజన్ శనివారం హైదరాబాద్‌కు వచ్చారు. గాంధీభవన్‌లో ఆమె వర్సిటీకి చెందిన ఎన్ఎస్యూఐ నేతలతో భేటీ అయ్యారు.