హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నది. సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా తొలి జాబితాలో వంద మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుండగా, తెలంగాణ నుంచి 10 మంది ఉంటారని పార్టీ వర్గాల సమాచారం. పది నియోజకవర్గాల విషయంలో పీసీసీ ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం కుదరడంతో ఆ జాబితాను ఇప్పటికే కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి అందజేసింది. హైదరాబాద్ నుంచి అలీ మస్కట్, సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేశ్షట్కర్, కరీంనగర్ నుంచి ప్రవీణ్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి బల్రామ్నాయక్, మహబూబ్‌నగర్ నుంచి వంశీచందర్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం కుదిరినట్టు సమాచారం. ఇంకా అభ్యర్థులు ఖరారు కాని నియోజకవర్గాల్లో ఖమ్మం, నాగర్‌కర్నూల్, మల్కాజిగిరి, భువనగిరి, నల్లగొండ, ఆదిలాబాద్, మెదక్ ఉన్నాయని సమాచారం. ఖమ్మం నుంచి పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని పోటీ చేయాల్సిందిగా పీసీసీ కోరుతుండటంతో ఆయన నుంచి స్పందన కోసం వేచి చూడాలని భావిస్తున్నట్టు తెలిసింది. నాగర్‌కర్నూల్ నుంచి బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తులో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీపై స్పష్టత వచ్చాకే అభ్యర్థిని ప్రకటించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
వరంగల్ స్థానంపై సీపీఐ కన్ను
వరంగల్ (ఎస్సీ రిజర్వ్) నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న సీపీఐ ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లింది. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా, జాతీయ కౌన్సిల్ సభ్యుడు రామకృష్ణ పాండా ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి వరంగల్ స్థానం తమకు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్‌గాంధీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే బదులిచ్చారు. ఇప్పటికే సీనియర్ జర్నలిస్ట్ బీఆర్ లెనిన్ అభ్యర్థిత్వాన్ని సీపీఐ నాయకత్వం ఖరారు చేసింది.