హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటిపోయిందని.. అయినప్పటికీ ఉద్యమకారులకు పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని సొంత పార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి నిలదీశారు. మండలిలో సోమవారం పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులు లేకపోతే, ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రు లు కానీ, మంత్రులు కానీ ఉం డేవారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం లో ప్రజలతోపాటు వివిధ సందర్భాల్లో ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీనీ ప్రభుత్వం తప్పనిసరిగా నిలబెట్టుకోవాలని డిమాండ్చేశారు.
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇండ్ల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం, ప్రాణాలర్పించిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చామని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అయినప్పటికీ ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని , ఎందుకు ఆలస్యమవుతున్నదో అర్థం కావడం లేదని వాపోయారు. ఉద్యమకారులను ఆదుకోవడం ప్రభుత్వ తప్పనిసరి బాధ్యతని చెప్పారు.
ఆ బాధ్యతను కాంగ్రెస్ ప్రభు త్వం సక్రమంగా నిర్వర్తిస్తే చరిత్రలో నిలుస్తుందని, వారిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం, పునరావాసం కల్పించాల్సిన అవసరముందని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇచ్చామని ఇంకా ఇవ్వలేదని అన్నారు. కమిటీ వేస్తామని చెప్పడం వల్ల మరింత కాలయాపన అవుతుందే తప్ప.. ఉద్యమకారులకు న్యాయం జరుగదని పేర్కొన్నారు.