Jeevan Reddy | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల కారణంగా తనలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలు స్థానికంగా రెచ్చిపోతున్నారని ఆరోపించారు.
పార్టీ ఫిరాయింపులను గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. తన అనుచరుడు గంగారెడ్డి హత్యతో అసమ్మతిని బహిరంగంగా వెల్లగక్కాడు. కాంగ్రెస్ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోవడం లేదు. దీంతో ఆయన్ను బుజ్జగించేందుకు టీపీసీసీ ప్రచార కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ శుక్రవారం జగిత్యాలకు వెళ్లారు. అక్కడ జీవన్ రెడ్డిని కలిసి ఆయన్ను పరామర్శించారు. అనంతరం ఇద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే జీవన్ రెడ్డి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఫిరాయింపుల కారణంగా తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయామని అన్నారు. తనకు చెప్ప కుండానే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. కాంగ్రెస్లోకి వచ్చాక ఆయన రెచ్చిపోయారని అన్నారు. పార్టీ ఫిరాయింపుల కారణంగానే గంగారెడ్డిని కోల్పోవాల్సి వచ్చిందని విచారం వ్యక్తంచేశారు.
మధుయాష్కీ గౌడ్ కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లోకి వస్తున్న వారు ఎవరూ కూడా పార్టీపై ప్రేమతో రావడం లేదని తెలిపారు. తమ స్వలాభం కోసం, అక్రమాస్తులను కాపాడుకోవడం కోసమే అధికార పార్టీలోకి వస్తున్నారని అన్నారు. అలా వచ్చిన వాళ్లెవరికీ కాంగ్రెస్ సిద్ధాంతాలపై విశ్వాసం లేదని మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపులతో మాలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లం ఆత్మస్టైర్యాన్ని కోల్పోయాం.. పార్టీలోకి వచ్చిన నేతలు రెచ్చిపోతున్నారు – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి pic.twitter.com/Dw0iNoc4Z4
— Telugu Scribe (@TeluguScribe) October 26, 2024