హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో విభజన హామీలు ఒక్కటీ అమలు కావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తలేరన్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచే అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని మోదీ ఎలా అంటారని ప్రశ్నించారు. స్వరాష్ట్రం సాధించుకొని తెలంగాణ సమాజం సంబురాలు జరుపుకొంటున్న సమయంలోనే మొదటి మంత్రివర్గ సమావేశంలో తెలంగాణకు చెందిన ఐదు మండలాలు, సీలేరు విద్యుత్తు కేంద్రాన్ని ఏపీలో కలిపారని మండిపడ్డారు. కృష్ణా జలాల పంపిణీ సరిగ్గా జరుగలేదని ఆరోపించారు. అసలు తెలంగాణలో ఓటు అడిగే హక్కు బీజేపీకి ఉన్నదా? అని నిలదీశారు. విభజన చట్టంలోని హామీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఉద్యమించడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విభజన అంశాలపై అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. భద్రాచలం పక్కన ఉన్న ఏడు గ్రామాలను తక్షణమే తెలంగాణలో కలపాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.