రామచంద్రాపురం, ఫిబ్రవరి 24: పటాన్చెరులో నియోజకవర్గం కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ సోమవారం సోమవారం ఆర్సీపురం డివిజన్లోని సితార హోటల్లో పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి, కాంగ్రెస్ పటాన్చెరు ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్, పార్లమెంట్ అభ్యర్థి నీలంమధు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా వచ్చిన వారు పార్టీ కోసం పనిచేయడం లేదని, జెండాలు మోసిన తమకు పదవులు, ప్రాధాన్యత దక్కడం లేదని కాట శ్రీనివాస్‌గౌడ్ వర్గం ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగా చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి వర్గానికి పదవులు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రేపటితో ప్రచారం ముగుస్తుంటే ఇప్పుడా సమావేశం ఏర్పాటు చేసేది అంటూ జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్‌గౌడ్ నిలదీశారు. సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. స్వతంత్ర అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేకు నర్సాపూర్ ఇన్చార్జి బాధ్యతలు ఎట్లా ఇస్తారని కాంగ్రెస్ క్యాడర్ నిలదీసింది. పార్టీ ఇన్చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పార్టీ జెండాలు మోయడానికే పనికి వస్తామా అంటూ అధిష్టానంపై మండిపడ్డారు.