Addanki Dayakar | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులు తగ్గించడానికే మంత్రులు హెలికాప్టర్లలో పర్యటిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. మంత్రుల హెలికాప్టర్ పర్యటనల మీద వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ముగ్గురు, నలుగురు మంత్రులు కలిసి పర్యటనలకు వెళ్తే కాన్వాయ్‌లో పదుల సంఖ్యలో కార్లు ఉంటాయని, వాటితో ఆర్థిక భారం ఎక్కువుంటుందని పేర్కొన్నారు.
అందుకే హెలికాప్టర్లో వెళ్తున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సుదూర ప్రాంతాల్లో రెండు, మూడు కార్యక్రమాలుంటే మాత్రమే మంత్రులు హెలికాప్టర్లను వాడుతున్నారని తెలిపారు. హెచ్‌సీయూ విషయంలో ఏఐ చిత్రాలతో తప్పుడు ప్రచారం వల్లే బుల్డోజర్కు, జేసీబీకి తేడా తెలియకుండా ప్రధాని మోదీ మాట్లాడారని విమర్శించారు.