హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills by-election) గెలుపు అవకాశాలు రోజు రో జుకు తగ్గిపోతున్నాయన్న భావన కాంగ్రెస్ (Congress) పార్టీ ఎమ్మె ల్యేల్ల్లో పెరిగిపోతున్నది. ఓడిపోయే సీటులో ప్రచారం ఎందుకన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీ ఇటీవల డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. మంత్రులతోపాటు బస్తీలకు, డివిజన్లకు ఎమ్మెల్యేలతో కూడా ప్రచార కమిటీలు వేసింది. అయితే, కొందరు ఎమ్మెల్యేలు ఉప ఎన్నిక ప్రచారం విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గెలిచే అవకాశమే లేనపుడు తాము బాధ్యతలు తీసుకోవడం వృథా అని, ఓడిపోతే అది తమకు ఓ మచ్చలా మిగిలిపోతుందన్న అభిప్రాయపడుతున్నారు.
సమన్వయ బాధ్యతలు స్వీకరించాలని పార్టీ అధిష్ఠానం కోరగా తాము ఈ ఉప ఎన్నిక ప్రక్రియ పట్ల ఆసక్తిగాలేమని, తమ నియోజకవర్గాల్లో పనులున్నాయని, రాలేమంటూ నిర్మోహమాటంగా చెప్పినట్టు తెలిసింది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తాము ప్రచారం చేయలేమని తేల్చి చెప్పారు. రౌడీషీటర్‌కు ప్రచారం చేయడం తమ వల్ల కాదని, నియోజకవర్గంలో అందరూ రౌడీషీటర్ అని చెప్తుంటే.. సెటిల్మెంట్లలో ఆరితేరే వ్యక్తి కోసం తాము వెళ్లి పనిచేయడం తమకు వ్యక్తిగతంగా ఇబ్బందిగా ఉంటుందని అన్నట్టు తెలిసింది. ప్రచారానికి రాలేమని పీసీసీ నేతలకు చెప్పడంతో వారు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. సీఎం అత్యంత సన్నిహితుడిగా ఉండే ఓ షాడో సీఎం కూడా ప్రచారానికి రావాలని ఆ ఎమ్మెల్యేలను కోరినప్పటికీ వారు నిరాకరించినట్టు తెలిసింది.