Konda Surekha | వరంగల్ జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ విభేదాలు భగ్గుమంటున్నాయి. మంత్రి కొండా సురేఖ, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య మొదలైన మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. అదృష్టం కొద్దీ నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కొండా సురేఖలా పూటకో పార్టీ మారితే నేను కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని సెటైర్లు వేశారు. ఈ మేరకు ఒక వీడియోను రిలీజ్ చేశారు.
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మధ్య భద్రకాళి ఆలయ పాలకమండలి కమిటీ చిచ్చు రేపింది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహార శైలిపై నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. తాము ఏది చేసినా నడుస్తోందని కొండా సురేఖ అనుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళి ఆలయ పాలకమండలిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దేవాదాయ శాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేయొచ్చా అని నిలదీశారు. అయినా నా నియోజకవర్గంలో ఆమె పెత్తనమేంటని అని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖ ఇదే పద్ధతి అవలంబిస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. అంతా మంత్రి చేశాక స్థానికంగా తాను ఉన్నది దేనికని, తన ఓపికకు పరీక్ష పెట్టవద్దని హెచ్చరించారు. ఈ విషయంలో కొండా సురేఖపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.
నాయిని వ్యాఖ్యలపై కొండా సురేఖ కూడా అంతే ఘాటుగా స్పందించారు. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. నాయిని రాజేందర్ రెడ్డిపై తాను వ్యాఖ్యలు చేయదలచుకోలేదని వ్యాఖ్యానించారు. అయినా తనకన్నా ముందు ఎమ్మెల్యే కావాలనుకున్న వ్యక్తి ఇప్పుడు అయ్యాడని విమర్శించారు. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో గుడిలో ఇద్దరు ధర్మకర్తలను భర్తీ చేసే స్వేచ్ఛ తనకు లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆ భర్తీ చేసిన పోస్టులు కూడా అధిష్ఠానం పంపించిన పేర్లే అని ఆమె వివరించారు. నాయిని రాజేందర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాయిని మరోసారి కొండా సురేఖపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.
కొండా సురేఖ, నాయిని రాజేందర్ రెడ్డి మధ్య భగ్గుమంటున్న విబేధాలు
నీ లాగా పూటకో పార్టీ మారితే నేను కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడిని అంటూ కొండా సురేఖ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి https://t.co/Mitz8I59Pn pic.twitter.com/dcfOZ1azjG
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2025