మహబూబ్‌నగర్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మా తెలంగాణలో మీకు ఆస్తులు కావాలి.. బిజినెస్ లు కావాలి.. కానీ మా సిఫార్సు లేఖలు మీ తిరుమలలో నడువవు.. అందుకే చం ద్రబాబు నాయుడు తెలంగాణలో అడు గు పెట్టొద్దు’ అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించడం చర్చనీయాంశమైంది. మ హబూబ్‌నగర్‌లో ముడా చైర్మన్ సన్మాన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో కలిసి తిరుమలలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు.
అక్కడ ఎమ్మెల్యేల ప్రొటోకాల్ విషయంలో టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర వ్యాఖ్య లు చేశారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి దీనికి వత్తాసు పలుకుతూ.. 119 మంది ఎమ్మెల్యేల మనసులో ఉన్న మాటను జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చెప్పారని, ఆయనకు తామంతా బాసటగా ఉంటామని స్పష్టంచేశారు. ‘కృష్ణా, గోదావరి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి.. మా తెలంగాణ నుంచే కదా? ఇక్కడి నుంచి వచ్చే నీళ్లు కావాలి కానీ.. మా తెలంగాణ ఎమ్మెల్యేలు మీకు వద్దా’ అంటూ చురకలంటించారు. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా సీఎం ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం సొంత జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే బాబును టార్గెట్ చేస్తుండటంతో రేవంత్ అసహనానికి గురవుతున్నట్టు సమాచారం.