మహబూబ్‌నగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్‌కు చెందిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కోవర్టులున్నారని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు బంద్ కావాలంటే చంద్రబాబు కోవర్టులకు కల్పిస్తున్న సదుపాయాలను బంద్ చేయాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో వాళ్లే ఉన్నారని, రోడ్డు కాంట్రాక్టర్లు వారేనని, హైదరాబాద్‌లో జరిగే దందాలు వారివేనని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం మోతీఘనపూర్‌లో బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణకు శాపంగా మారనున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడానికి కేవలం లేఖలు రాస్తే సరిపోదని చెప్పారు. ‘ఏపీ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న బనకచర్ల ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమన్నకు ఓ సూచన చేస్తున్నా.. లెటర్లు రాస్తున్నారు.. లెటర్లు కాదు.. చంద్రబాబు కోవర్టులు మన తెలంగాణలో ఉన్నారు.. ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టులు వాళ్లే.. రోడ్ల కాంట్రాక్టర్లు వాళ్లే.. హైదరాబాద్‌లో దందాలు వాళ్లవే.. ఆ కోవర్టులకు మొత్తం నల్లా కలెక్షన్లు కట్ చేయండి.. కరెంటు కనెక్షన్లు కట్ చేయండి.. ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఒక్క రుపాయి వాళ్లకు పోకుండా ఆపండి.. అప్పుడు వాళ్లే వెళ్లి చంద్రబాబు కాళ్లు పట్టుకొని బనకచర్ల బంద్ చేపిస్తరు’ అని వ్యాఖ్యానించారు. ‘మనం మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోళ్లు మాట వినరు’ అని చెప్పారు. అనిరుధ్‌రెడ్డి ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు తన సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి అనుచరుడిగా పేరొందిన అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో అనేకసార్లు చర్చకు దారితీసాయి.
ఇటీవల టెన్ పర్సెంట్ కమీషన్ అంటూ ఓ మంత్రిపై విమర్శలు ఎక్కు పెట్టారు. ఇంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డితో సన్నిహితంగా ఉండే ఓ మంత్రిపై కూడా ఇలాగే వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై మంత్రి కన్ను పడిందని.. దీనిపై విచారణ జరిపించాలని చేసిన వ్యాఖ్యలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి జోక్యం చేసుకునే వరకు వెళ్లాయి. ఇప్పుడు బనకచర్ల విషయంలో.. హైదరాబాద్‌లో ఉండి కాంట్రాక్టులు.. పొందుతున్న వాళ్లంతా చంద్రబాబు నాయుడు శిష్యులేనని.. వాళ్లందరి భరతం పట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాను అంటేనే జడ్చర్లకు బ్రాండ్ ఇమేజ్ అని, గన్మెనుల లేకుండా హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో తిరగగలనని సవాల్ చేశారు.